పాడుతా తీయగా కార్యక్రమం, అక్కడ జడ్జీలు ప్రవర్తించే తీరుపై యువగాయని ప్రవస్తి హాట్ కామెంట్లు చేసింది. జడ్జీలుగా ఉన్న కీరవాణి, చంద్రబోస్, సునీత తనని చిన్న చూపు చూశారని, అవహేళన చేశారని, బాడీ షేమింగ్ కూడా జరిగిందని వివాదాస్పద కామెంట్లు చేసిన చేసింది ప్రవస్తి. అటు ‘పాడుతా తీయగా’ షో రన్నర్స్పై కూడా కొన్ని ఆరోపణలు వినిపించింది. ‘చీర బొడ్డు కిందకు కట్టుకోమని చెప్పారు’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనిపై అటు వ్యాఖ్యాతలూ, ఇటు ఈటీవీ యాజమాన్యం స్పందించక తప్పని పరిస్థితి కల్పించింది.
ప్రవస్తి ఆరోపణలకు చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆమెకు మద్దతుగా మాట్లాడారు. ‘పాడుతా తీయగా’ బ్రాండ్ ఇమేజ్‌పై తొలిసారి అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో `పాడుతా తీయగా` టీమ్ సక్సెస్ అయ్యింది. ముందుగా గాయని సునీత ఓ సుదీర్ఘ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో సునీత తనపై, ‘పాడుతా తీయగా’ కార్యక్రమంపై ప్రవస్తి చేసిన ప్రతీ ఆరోపణనీ హుందాగా, చాలా సవివరంగా బదులు ఇచ్చిన పద్ధతి ఆకట్టుకొంది. ‘అమ్మా.. ప్రవస్తి’ అంటూ మొదలెట్టిన సునీత… పిన్ టూ పిన్, పాయింట్ టూ పాయింట్ డిటైల్డ్ గా వివరణ ఇచ్చారు. సునీత వీడియో చూశాక.. ప్రవస్తి తొందర పడి, తప్పుగా అర్థం చేసుకొని, ఆవేశం కొద్దీ.. ఆరోపణలు చేసిందేమో అనిపిస్తోంది.
తాను ఎలిమినేట్ అయితే సునీత మిగిలిన టీమ్‌కి పార్టీ ఇచ్చారన్నది ప్రవస్తి చేసిన ప్రధాన ఆరోపణల్లో ఒకటి. దానిపై సునీత ఇచ్చిన వివరణ చాలా చక్కగా వుంది. పాటల ఎంపిక గురించి కూడా ప్రవస్తి కొన్ని ఆరోపణలు చేసింది. బాగా వచ్చిన పాట, ప్రాక్టీస్ చేసిన పాట పాడకుండా అడ్డు పడుతున్నారన్నది ప్రవస్తి బాధ. దానికి సునీత సరైన వివరణే ఇచ్చారు. ”పాటలకు సంబంధించిన రైట్స్ ఉంటాయి. ప్రతీ పాటా.. పాడడానికి కుదరదు. సింగర్స్ ప్రిపేర్ అయిన పాటల్లో ఏ పాటకు సంబంధించిన రైట్స్ నిర్వాహకుల దగ్గర ఉందో తెలుసుకోవాలి. అలాంటి పాటలకే అనుమతి ఉంటుంది. ఇప్పటికే అలాంటి పాట పాడుతా తీయగా కార్యక్రమంలో చాలాసార్లు పాడితే… ఆ పాటను పక్కన పెట్టి, కొత్త పాట పాడమంటారు” అనేది సునీత వివరణ. ఇలా ప్రతీ విమర్శకూ.. చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు సునీత.
దుస్తుల విషయంలో ఈటీవీ యాజమాన్యం కూడా స్పందించింది. ఇప్పటి వరకూ ప్రవస్తి 10 సార్లు వేదికపై కనిపించిందని, పదిసార్లూ ఆమెకు పద్ధతైన కాస్ట్యూమ్సే ఇచ్చామని, ఇన్నేళ్ల ఈ షోలో ఒక్క అమ్మాయి కూడా స్లీవ్ లెస్ గా కనిపించలేదని, అది తాము పాటిస్తున్న ప్రమాణాలకు నిదర్శనమని రుజువులతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. సో.. ఈ విషయంలోనూ ప్రసస్తిది కేవలం ఆరోపణగానే మిగిలిపోయింది. ఏ రంగంలో అయినా సరే.. విమర్శలు, ఆరోపణలు సహజం. ఒకరిపై ఆరోపణ రాగానే, బయటకు వచ్చి, మైక్ అందుకొని.. రెచ్చిపోయేలా మాట్లాడడం, ఆ ఇష్యూని మరింత పెద్దది చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. సునీత చాలా కామ్ గా ఈ విషయాన్ని హ్యాండిల్ చేసిన విధానం.. ఆకట్టుకొంది.