ఈటీవీ కార్యక్రమాలన్నింటిలోనూ మకుటాయమానంగా నిలిచింది `పాడుతా తీయగా`. ఈ కార్యక్రమాన్ని ఏళ్ల తరబడి ముందుండి నడిపించారు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. ఎంతోమంది గాయనీ గాయకుల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఓతరం ప్రేక్షకులు.. ఈ కార్యక్రమానికి వీరాభిమానులుగా మారిపోయారు. చిన్నారులు పాడే పాటలు, బాలు పంచుకునే జ్ఞాపకాలు, అతిథుల మాటలతో.. రసవత్తరంగా సాగిపోయేది. అయితే బాలు మరణంతో.. `పాడుతా తీయగా` ఆగిపోయింది. బాలు తరవాత ఆ స్థానాన్ని పూడ్చడం అసాధ్యం. అందుకే `పాడుతా తీయగా`కి పుల్ స్టాప్ పడిపోతుందేమో అనుకున్నారంతా.
కానీ… రామోజీరావు ఆ బాధ్యతని బాలు తనయుడు చరణ్‌పై పెట్టారు. `పాడుతా తీయగా`ని చరణ్‌తో కొనసాగించాలని నిర్ణయించారు. ఈసారి చరణ్ కి తోడుగా చంద్రబోస్, సునీతలు కూడా ఉంటారు. ఈ ముగ్గురి ఆధ్వర్యంలో `పాడుతా తీయగా` కొనసాగబోతోంది. ఇటీవల కొన్ని ఎపిసోడ్లు కూడా తెరకెక్కించినట్టు సమాచారం. బాలు స్థానాన్ని భర్తీ చేయడం.. ఎవ్వరికీ సాధ్యం కాదు. కాకపోతే… ఆయన్ని అప్పుడప్పుడూ గుర్తుకు తెస్తూనే, కొత్త బాటలో సాగితేనే.. `పాడుతా తీయగా` మళ్లీ నిలబడుతుంది. మరి… ఈ త్రయం ఏం చేస్తుందో చూడాలి. కాకపోతే.. `పాడుతా తీయగా`కు పుల్ స్టాప్ పడలేదన్నమాట మాత్రం.. సంగీతాభిమానులకు తీపి కబురే.