వైఎస్ఆర్సీపీ హాయంలో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. బెదిరించి ఆస్తులు రాయించుకోవడం.. కంపెనీలను తరిమేయడం.. ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం తప్ప రాష్ట్రంలో ఏమీ ఉండేది కాదు. అభివృద్ధి గురించి, ఉపాధి గురించి ఆలోచించే పరిస్థితి కల్పించేవారు కాదు. కానీ ఇప్పుడు అంతా పోలవరం, అమరావతి, పరిశ్రమలు, పెట్టుబడులు అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టి రాష్ట్రాన్ని మత విద్వేషాల కేంద్రంగా మార్చేందుకు కొంత మంది ఘోరమైన కుట్రలు పన్నారు. దానికి పగడాల ప్రవీణ్ అనే మత ప్రచారకుని రోడ్డు ప్రమాదాన్ని వాడుకుంటున్నారు.
పగడాల ప్రవీణ్ ఎలా చనిపోయారో కళ్ల ముందే ఆధారాలు
పగడాల ప్రవీణ్ ఎలా చనిపోయాడో కళ్ల ముందే ఆధారాలు ఉన్నాయి. ఆయన సికింద్రాబాద్ లో ఇంటి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయే వరకూ తాగుతూనే ఉన్నారు. ఆరేడు మద్యం దుకాణాల వద్ద ఆయన మద్యం కొంటున్నట్లుగా సీన్ ఫుటేజీ లభ్యమయింది. ఆయన ఎంత ఘోరంగా డ్రైవింగ్ చేశారో కూడా తెలిపోయింది. ఆయన అంత దూరం వెళ్లడమే దేవుడి దయ అనుకోవాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. కానీ కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్ని తప్పు అని వాదించి చంపేశారని ప్రచారం చేస్తున్నారు కొందరు. దీనికి ఖచ్చితంగా.. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్ర కోణమే కారణం అని సులువుగా అంచనా వేయవచ్చు.
ప్రవీణ్ మృతిని హత్య అని ప్రచారం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర
ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు అందరూ అది హత్య కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తే వారి మనోభావాలను గౌరవించేందుకు ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేయించింది. మొత్తం వివరాలు తెలిసిన తర్వాత కూడా పాస్టర్ గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ దాన్ని అవకాశంగా తీసుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ప్రవీణ్ ను హత్య చేశారు అంటారు కానీ ఎవరు చేశారో మాత్రం చెప్పరు. ఇదందా విద్వేష రాజకీయాల కోసం కాక మరేమిటి ?
ప్రవీణ్ పగడాల పరమత విద్వేషకుడు !
నీవు నమ్మే మతాన్ని ఆచరించు.. అది దేవుడని ప్రార్థించడం అవుతుంది. అంతే కానీ నీకు నచ్చని మతాన్ని తిట్టడం.. అందులో దేవుళ్లను అసహ్యంగా మాట్లాడటం ఏ ఒక్క మత ప్రచారకుడూ చేయడు. బైబిల్ కూడా అలా చెప్పదు. కానీ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి హిందూ దేవుళ్లను దూషించాడు. అతను స్వచ్చమైన మత ప్రచారకుడు అయితే అలా చేసేవాడు కాదు. అయితే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయేవరకూ ఆయనకు అంత ఫేమ్ రాలేదు. చనిపోయిన తర్వాతే వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలి !
ప్రవీణ్ పగడాల మృతిని అడ్డం పెట్టుకుని మత విద్వేషాలతో రాజకీయం చేయాలనుకునేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తప్పుడు ప్రచారం చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయనది హత్యే అని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటిస్తున్న రాజకీయ నేతలపై ఆ ఆధారాలు ఇవ్వకపోతే కేసులు పెట్టాలి. మరో సారి మత రాజకీయాలు చేయాలంటే భయపడేలా చేయాల్సి ఉంది.