మిగిలిన చోట్ల పెద్దగా ప్రభావం చూపకపోయినా హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించినంత వరకూ చాలా సంచలనమైన తీర్పు ఒకటి వెలువడింది. 2011లో మజ్లిస్ శాసనసభా పక్ష నేత, చిన్న సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ పహిల్వాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఏడవ అడిషనల్ సెషన్స్ జడ్జి తీర్పు నిచ్చారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తను ప్రయత్నించిన కారణంగానూ రాజకీయ వైరంతోనూ పహిల్వాన్ ఈ హత్యా ప్రయత్నం చేయించారని ఆక్బరుద్దీన్ ఫిర్యాదు కాగా పోలీసులు కూడా అదే తరహాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరేళ్లుగా ఆయన చర్లపల్లి జైలులో వున్నారు. తనతో పాటు మరికొందరు కూడా నిందితులుగా విచారణ నెదుర్కొన్నారు. అయితే పహిల్వాన్ వారితో కలసి హత్యకు కుట్రపన్నినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. అర్ధరాత్రి ఆయన విడుదలై పెద్ద జాతరగా ఇంటికి చేరుకున్నారు. మరోవైపున ఒవైసీలకు ఈ తీర్పు చాలా నిరుత్సాహం కలిగించింది. మజ్లిస్ నుంచి విడిపోయి ప్రత్యేకంగా ఏర్పడిన మజ్లిస్ బచావో తరాకే(ఎంబిటి)కి పహిల్వాన్ మద్దతు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రపు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆయన మద్దతు కోసం కాంగ్రెస్ నేత దిగ్విజరు సింగ్ స్వయంగా వెళ్లి సంప్రదింపులు జరిపారు.
ఇప్పుడు ఆయన విడుదల కాగానే అక్బరుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయేషా కేసులో సత్యం బాబు విడుదల వల్ల ఉత్సాహం పొందిన తాను బలమైన శక్తులకు వ్యతిరేకంగా ఈ కేసు వాదించానని న్యాయవాది రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. మిగిలిన నిందితులు కూడా త్వరలోనే విడుదలవుతారని ఆశిస్తున్నట్టు పహిల్వాన్ వర్గీయులు చెబుతున్నారట. అయితే మజ్లిస్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో దీనిపై విస్తారంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన విడుదలతోనే పరిస్తితులు మారేదేమీ వుండదని పేర్కొన్నారు. రెండు శక్తుల మధ్య పాతబస్తీ రాజకీయం రసవత్తరంగానూ వేడివేడిగానూ మారింది.2019లో పహిల్వాన్‌కు కాంగ్రెస్ మద్దతు నివ్వొచ్చనేది ఒక ప్రచారంగా వుంది. ఎందుకంటే మజ్లిస్ ఇప్పుడు టిఆర్ఎస్తో స్నేహం నెరుపుతున్నది. పాతబస్తీలోఒవైసీ కుటుంబంపై ఒక దశలో సిపిఎం ఎంపి పి.మధు గట్టిగా పోరాడారు. ఇప్పుడాయన ఎపి రాష్ట్ర కార్యదర్శిగావున్నారు.ఇక మరోవైపున సియాసత్ పత్రికా సంపాదకుడు జావేద్ అలీఖాన్ మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌కు మొదటిసారి గట్టిపోటీ ఇచ్చారు. వారిద్దరి తర్వాత వ్యక్తిగత కోణంలోనైనా వారితో తలపడిన వ్యక్తి పహిల్వాన్ మాత్రమే.హైదరాబాద్‌కు ముఖ్యంగా పాతబస్తీకి సంబంధించినంత వరకూ ఈ తీర్పు చాలా మార్పులకు కారణంకావచ్చు. తెలుగు పత్రికలన్నా మించి టైమ్స్ ఆఫ్ ఇండియా దీనిపై ఒక పేజీ కథనాలు ప్రచురించడం ఇందుకు ఒక ఉదాహరణ.