గూగుల్ మ్యాప్ లో ఒకవేళ ఉగ్రవాద కేంద్రాలను చూపించే అవకాశమే ఉంటే, అందులో పాకిస్తాన్ తప్పకుండ ఉంటుందని చెప్పవచ్చు. ఉగ్రవాదం వలన స్వయంగా నష్టపోతున్నా కూడా దానిని నియంత్రించలేకపోగా, ఉగ్రవాదులని స్వయంగా కాపాడవలసిన దుస్థితిలో ఉంది. ఉగ్రవాదంపై పోరు కోసం అంటూ ఏటా అమెరిక నుంచి లక్షల కోట్లు పన్నులాగ వసూలు చేసుకొంటున్న పాకిస్తాన్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో భద్రతాదళాల చేతిలో హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ హతమయితే నిసిగ్గుగా ఖండిస్తోంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులతో గొంతు కలిపి నిరసన తెలపడం సిగ్గు చేటు. భద్రతాదళాల చేతిలో ఒక ఉగ్రవాది మరణిస్తే అందుకు సంతోషించకపోగా దానిని కాశ్మీర్ సమస్యగా, మానవ హక్కుల ఉల్లంఘనగా చిత్రీకరిస్తూ ఐక్యరాజ్యసమితి కలుగజేసుకోవాలని కోరారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక ఉగ్రవాదికి అనుకూలంగా మాట్లాడడటం ద్వారా తమ దేశం ఉగ్రవాదానికి సంపూర్ణ మద్దతు పలుకుతోందని స్వయంగా దృవీకరించుకొన్నట్లయింది. పాకిస్తాన్ న్ని ఉగ్రవాదం నుంచి వేరు చేసి చూడలేమని పాక్ ప్రధాని మరోసారి నిరూపించారు.