ఈరోజు యావత్ భారత్ మీడియాలో ఒక వార్త బాగా హైలైట్ అయ్యింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ కి వ్యతిరేకంగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలు చేయవద్దని తన మంత్రివర్గానికి సూచించినట్లు, ఆయన సన్నిహితుడు ఒకరు పాక్ మీడియాకు తెలియజేసారనే వార్త. పాక్-భారత్ ల మధ్య ఇపుడిపుడే సంబంధాలు మళ్ళీ బలపడుతున్నాయి కనుక ఆ సానుకూల పరిస్థులకు భంగం కలిగించేవిధంగా ఎవరూ మాట్లాడవద్దని పాక్ ప్రధాని హెచ్చరించినట్లు సమాచారం.
పాకిస్తాన్ నుంచి ఇటువంటి సానుకూలత చూసి చాలా ఏళ్ళు అయింది కనుక అల్పసంతోషి అయిన భారత్ చాలా సంతోషించడం సహజమే. పాక్ ప్రధాని నవాజ్ సహరీఫ్ భారత్ తో సంబంధాలు మళ్ళీ మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నప్పటికీ, దేశంలో తిష్ట వేసుకొని కూర్చొన్న తీవ్రవాదులు, మత ఛాందసవాదులు పాక్ సైనిక, ఐ.ఎస్.ఐ.అధికారులు ఆయనను అడుగు ముందుకు వేయకుండా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధంగా అడ్డుకోవచ్చును లేదా తీవ్రవాదులు భారత్ పై దాడులకు తెగబడి శాంతి చర్చలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయవచ్చును. కానీ మోడీ చూపిన చొరవకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా సానుకూలంగా స్పందించడం గమనిస్తే భారత్ పట్ల పాక్ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది. కానీ అది ఎంత కాలం నిలకడగా ఉంటుందో ఎవరికీ తెలియదు. బహుశః పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి కూడా తెలియదేమో? ఏది ఏమయినప్పటికీ పాక్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నందుకు సంతోషించవలసిందే.