హైదరాబాద్: కాశ్మీర్‌లోని ఉదమ్‌పూర్‌లో ఇటీవల పట్టుబడిన పాకిస్తాన్ తీవ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ మాట మార్చాడు. పట్టుబడిన సమయంలో హిందువులను చంపటం తనకు సరదాగా ఉంటుందని చెప్పిన నవేద్, ఇప్పుడు తనను వదిలిపెడితే – పాకిస్తాన్ వెళ్ళి తనను ఈ పనికి పంపిన లష్కరే తోయిబా వారిని చంపివస్తానని అంటున్నాడు. ఇంటరాగేషన్‌లో అతను మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తమను ఆత్మాహుతిదాడికి పంపేముందు ఒక మాదకద్రవ్యాన్ని తమకు ఇచ్చారని చెప్పాడు. దీనివలన తాము ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కి తెలిపాడు. ఈ మాదకద్రవ్యంవలనే పట్టుబడినప్పుడు నవేద్ నవ్వుతూనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా విచారిస్తున్న తమకు నవేద్ ఒక్కటొక్కటేగా తన విశేషాలను చెబుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. తాను ఏ పనీలేకుండా తిరుగుతుండగా లష్కరే తోయిబాకు చెందిన మౌల్వీ ఒకరు పట్టుకుని తనలో భారతదేశంపట్ల ద్వేషాన్ని రగిల్చి ఈ పనికి పురిగొల్పారని నవేద్ చెప్పాడు. ఈ ఏడాది మార్చిలో తమకు ఆరువారాల శిక్షణ ఇచ్చి జూన్‌లో సరిహద్దుదాటించి భారత్‌లోకి పంపారని వెల్లడించాడు.
మరోవైపు నవేద్‌పై రేపు లైడిటెక్టర్ టెస్ట్ జరపటానికి ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఢిల్లీ కోర్టులో అనుమతి తీసుకున్నారు. అతని డీఎన్ఏ, స్వరనమూనాలనుకూడా అధికారులు తీసుకోనున్నారు. నవేద్, అతని సహచరుడు మొమిన్ ఈనెల ఐదోతేదీన ఉధమ్పూర్లో సైనికుల కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు చనిపోగా, డజనుమంది జవాన్లు గాయపడ్డారు. జవాన్లు జరిపిన ప్రతిదాడిలో మొమిన్ చనిపోగా, నవేద్‌ను సజీవంగా పట్టుకున్నారు.