అమెరికా, పాకిస్తాన్ దేశాల మద్య ఊహించని విధంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఉద్దేశ్యించి చేసిన అనుచిత వ్యాక్యాలు ఒక కారణమయితే, ఎఫ్-16 యుద్ద విమానాలపై అమెరికా మాట మార్చడం మరో కారణం.
డోనాల్డ్ ట్రంప్ మొన్న ఇండియానాలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “నేను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయితే పాక్ జైల్లో మ్రగ్గుతున్న డా. అఫ్రీది (ఉగ్రవాది బిన్ లాడెన్ ఆచూకీని అమెరికాకి తెలిపిన వ్యక్తిగా భావించబడుతున్నవాడు)ని తక్షణమే విడిచిపెట్టమని పాకిస్తాన్ని ఆదేశిస్తాను. అది తప్పనిసరిగా నా ఆదేశాలు పాటించాలి. ఎందుకంటే మనం ఆ దేశానికి చాలా ఆర్ధిక సహాయం చేస్తున్నాము,” అని అన్నారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి చౌదరి నిసర్ అలీ ఖాన్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. “అమెరికా అధ్యక్షుడు కావలనుకొంటున్న ట్రంప్ మొదట ఇతరదేశాలతో ఏవిధంగా మసులుకోవాలో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఆదేశాలను పాటించడానికి మా దేశమేమీ అమెరికా అధీనంలో లేదు..దాని కాలనీ కాదు. పాకిస్తాన్ ఒక సార్వభౌమాదికారం కలిగిన స్వతంత్ర దేశం అని ఆయన గ్రహించి గౌరవించడం నేర్చుకోవాలి. అమెరికా ఇచ్చే చిల్లర కోసం మేము మా దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టము. ట్రంప్ విదేశీ విధానం చాలా విచిత్రంగా ఉంది. ఆయన మాటలు వింటుంటే ఆయనకి విదేశీ విధానం పట్ల అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు,” అని విమర్శించారు.
పాకిస్తాన్ కి సబ్సిడీ మీద అమెరికా ఇస్తానన్న 8 ఎఫ్-16 యుద్ద విమానాల విషయంలో మాట తప్పడం పాకిస్తాన్ కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆ విమానాలను పాక్ చేతికి వస్తే వాటిని మొదట ఉగ్రవాదులకు బదులు భారత్ మీదనే ప్రయోగిస్తుందని అమెరికన్ కాంగ్రెస్ భయం వ్యక్తం చేసింది. కనుక వాటి కొనుగోలుకి అమెరికా జాతీయ నిధుల నుంచి పాకిస్తాన్ కి ఎటువంటి ఆర్ధిక సహాయం చేయనవసరం లేదని అభ్యంతరం చెప్పింది. కనుక పాకిస్తాన్ కి ఆ అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలనుకొంటే పూర్తి ధర చెల్లించి కొనుకోవచ్చని అమెరికా ప్రభుత్వం తేల్చి చెప్పింది. బహుశః భారత్ విదేశాంగ శాఖ అధికారుల లాబీయింగ్ ఫలించినందునే అమెరికా తన నిర్ణయం మార్చుకొందేమో?
పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ “ముందు అంగీకరించిన ప్రకారం సబ్సిడీ మీద యుద్ధ విమానాలు ఇవ్వకపోతే మేము వేరే దేశాల నుంచి సమకూర్చుకొంటాము,” అని తేల్చి చెప్పారు.