హైదరాబాద్: పాకిస్తాన్ రక్షణశాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమవద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం ప్రదర్శనకోసం కాదని, అవసరమైతే వాటిని ఉపయోగిస్తామని హెచ్చరించారు. జియో అనే పాకిస్తాన్ టీవీ ఛానల్లో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు ఉపయోగించే సందర్భం రాకూడదని కోరుకుంటున్నామని, అయితే మనుగడకు సవాళ్ళు ఎదురైతే వాడటానికి వెనకాడబోమని అన్నారు. పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తూ భారత్ ప్రఛ్ఛన్నయుద్ధం చేస్తోందని ఆరోపించారు. పాక్ రక్షణ సామర్థ్యం మహత్తరంగా ఉందని చెప్పారు. ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. కొంతకాలంక్రితం మూషారఫ్కూడా ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని రక్షణరంగ నిపుణుడు రాజ్ కడ్యన్ అన్నారు. పాకిస్తాన్ మూర్ఖంగా అలాంటి చర్యలకు దిగితే ఆ దేశం ప్రపంచపటంనుంచి కనుమరుగవుతుందని చెప్పారు. మరోవైపు రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడి రష్యాలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కాబోతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో హాజరవటానికి వీరిరువురూ రష్యా వెళ్ళారు. ఇరుదేశాలమధ్య శాంతి చర్చలు పునఃప్రారంభానికి ఈ భేటీ ఉపయోగపడొచ్చని మరో రక్షణరంగ నిపుణుడు ఉదయభాస్కర్ వ్యాఖ్యానించారు.