ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కి పాకిస్తాన్ వీసా నిరాకరించింది. ఈనెల 5నుంచి కరాచీలో నాలుగు రోజులపాటు జరుగనున్న సాహిత్య సమావేశాలకు ఆయన అతిధిగా ఆహ్వానించబడ్డారు. అందుకు ఆయన కూడా సమ్మతించారు. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన వీసా నిరాకరించింది. ఆయనతో బాటు ఆహ్వానింపబడిన మిగిలిన 17మందికి వీసాలు మంజూరు చేసింది.
అనుపమ్ ఖేర్ ఒక్కరికే ఎందుకు నిరాకరించిందో పాక్ చెప్పలేదు. “బహుశః నేను కాశ్మీరీ పండిట్ అయినందునో లేకపోతే మత అసహనంపై నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలు నచ్చనందునో నాకు వీసా నిరాకరించి ఉంటుందని భావిస్తున్నాను. పాకిస్తాన్ కి చెందిన కళాకారులు, రచయితలకు భారత్ ఎప్పుడూ సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. ఒకవేళ ఏదయినా స్థానిక సమస్యల కారణంగా దేశంలో ఒక ప్రాంతానికి వారిని అనుమతించలేకపోయినా వేరే ప్రాంతంలో వారికి సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తాము. పాకిస్తాన్ నా పట్ల ఈవిధంగా వ్యవహరించడం దురదృష్టకరం,” అని అనుపమ్ ఖేర్ అన్నారు.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ “భారత్ లో మత అసహనం పెరిగిపోతున్న కారణంగా దేశంలో ఉండాలంటేనే భయం వేస్తోంది దేశం విడిచిపెట్టి వేరే ఎక్కడకయినా వెళ్ళిపోదామా?” అని తన భార్య తనతో అన్న విషయాన్ని మీడియాకి చెప్పినప్పుడు, అనుపమ్ ఖేర్ చాలా తీవ్రంగా స్పందించారు. “భారత్ లో ఉండేందుకు అంతగా భయపడుతున్నట్లయితే, అమీర్ ఖాన్ తక్షణమే తన కుటుంబంతో సహా ఏ పాకిస్తాన్ కో వెళ్ళిపోవడం మంచిది,” అని ఘాటుగా స్పందించారు. బహుశః అందుకే ఆయనకి పాక్ ప్రభుత్వం వీసా నిరాకరించిదేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఆయనకు వీసా నిరాకరించడంతో ఆ సమావేశ నిర్వాహకులు ఆయనకు క్షమాపణలు చెప్పారు.
భారత ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమయిన పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. పైగా అయన ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు. బీజేపీకి మద్దతుదారుడు కూడా. అటువంటి ప్రముఖ వ్యక్తికి పాకిస్తాన్ వీసా నిరాకరించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ఇంతవరకు స్పందించలేదు. ఒకవేళ మోడీ ప్రభుత్వం అనుపమ్ ఖేర్ కి జరిగిన ఈ అవమానాన్ని తీవ్రంగా పరిగణించినట్లయితే ఏదో ఒక రోజున ‘టిట్-ఫర్-టాట్’ తప్పకపోవచ్చును.