కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా ప్రభుత్వ రంగంలోని అన్ని సంస్థలను ప్రైవేట్ పరం చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఒక వ్యూహాత్మక రంగ సంస్థలకు మాత్రం ప్రైవేటీకరణ నుంచి మినహాయింపు ఇచ్చి మిగతా అన్ని సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది పాక్ ప్రభుత్వం.
ఆర్థికంగా నష్టపోయి దివాళా తీస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థలపై సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేశారు. పాక్ కు సాయం అందించాలని ఐఎంఎఫ్ తో చర్చించిన తర్వాత దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయనున్నట్లు ప్రధాని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా అన్ని మంత్రిత్వ శాఖలు ప్రైవేటీకరణ కమిషన్ కు సహకరించాలని ప్రధాని ఆదేశించారు.