కరోనా వైరస్ మొదటివేవ్లో ఇండియా సాయం చేసిన అనేక దేశాలు.. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో ఇండియా పరిస్థితి పట్ల జాలి చూపిస్తున్నాయి. సాయం చేస్తామని ముందుకు వస్తున్నాయి. మొదటివేవ్ని కంట్రోల్ చేసుకోలేక.. ఇండియా నుంచి మందులు.. రెమిడెసివర్ ఇంజెక్షన్లు.. పిపీఈ కిట్లు వంటి వాటి సాయం పొందిన దేశాలు ఇప్పుడు.. భారత్కుతాము సాయం చేస్తామని ముందుకు వస్తున్నాయి. ప్రపంచానికే ధన్వంతరిగా మారామని.. కరోనా కట్టడిలో అందరికీ ఆదర్శంగా మారామని చెప్పుకున్న పాలకులకు ఈ విషయం మింగుడుపడనిదే. అయితే అంత కన్నా.. వారిని ఇబ్బంది పెట్టే అంశం కూడా ఉంది. అదేమిటంటే.. పాకిస్థాన్ నుంచి సహాయం ఆఫర్ రావడం.
పాకిస్థాన్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా లేదు. మొదటి వేవ్‌తోనే ఆ దేశం కకావికలం అయిపోయింది. అయితే ఆ తర్వాత చైనా సాయంతో ఎలాగోలా బయటపడింది. ఇప్పుడు ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇండియాలోని పరిస్థితి చూసి.. తాము కూడా సాయం చేస్తామని పాకిస్తాన్ అధికారిక ప్రకటనచేసింది. భారత ప్రజల దుస్థితిని చూసి జాలి చూపించింది. పాకిస్తాన్ స్పందన మానవత్వ పరంగా ఓకే అనుకున్నా… అసలు పాకిస్థాన్ నుంచి సాయం పొందే దుస్థితికి దిగజారడం చాలా మంది దేశభక్తుల్ని ఆవేదనకు గురి చేస్తోంది.
ఇండియాలో పరిస్థితిపై ఒక్క పాకిస్థాన్ మాత్రమే కాదు.. అన్ని దేశాలు జాలి చూపిస్తున్నాయి. ఇండియాలో ఉన్న దుర్భర పరిస్థితుల్ని చాలా దేశాలు.. ప్రత్యక్షంగా మీడియాలో చూపిస్తున్నాయి. ఆస్పత్రి దగ్గర ఉన్న పరిస్థితుల్ని లైవ్‌లో చూపిస్తున్నారు. స్కై న్యూస్ .. ఫాక్స్ న్యూస్ సహా.. చాలా మంది రిపోర్టర్లు… ఇండియా దుస్థితిని ప్రపంచం ముందు పెడుతున్నారు. ఇవి వైరల్‌గా మారుతున్నాయి. గొప్పలుచెప్పుకుని ఇంకా రెండు, మూడు నెలలు కూడా కాక ముందే.. ప్రపంచంలోనే అతి వరస్ట్ సిట్యూయేషన్‌ను అంత కంటే ఘోరంగా డీల్ చేస్తున్న వైనం ఇతర దేశాల వారిని ఆశ్చర్య పరుస్తోంది.
పాలకులు పొగడ్తలకు అలవాటుపడి.. ప్రచారయావలో ఉంటే… ప్రజలే ఇబ్బంది పడతారు. వారికి మద్దతుగా ఉంటూ… ప్రజల కష్టాలను… లైట్ తీసుకుని.. ఇలాంటి సమయంలోనూ పాలకుల్ని సరైన దారిలో నడిపించేలా అయినా విమర్శలు చేయకపోతే.. ఆ కష్టం.. చివరికి సమర్థించేవారికే జరగొచ్చు. అందుకే పాలకుల్ని గుడ్డిగా సమర్థించడం కన్నా.. వారు సరైన రీతిలో పాలన చేసేలా ఎప్పటికప్పుడు విమర్శించడం వల్ల మేలు చేసిన వారవుతారు.