ప్రధాని నరేంద్ర మోడీ గురించి కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో ప్రతిపక్ష పార్టీలు చాలా విమర్శలు గుప్పిస్తుండవచ్చును. కానీ అమెరికాలో ఆయనకి ప్రవాసభారతీయులు, సాఫ్ట్ వేర్ సంస్థలు, పెట్టుబడుదారులు నీరాజనాలు పడుతున్నారు. భారత సంతతికి చెందిన సుందర్ పిచ్చాయ్, ఇంద్రా నూయీ, సత్యం నాదెళ్ళ వంటివారనేకమంది ప్రముఖ సంస్థలకు సీ.ఈ.ఓ.లుగా ఉండటం ఆయనకు మరింత కలిసి వచ్చింది. ఆయన పర్యటనలో ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థలకు చెందిన 350మంది సీ.ఈ.ఓ.లతో విందు సమావేశంలో పాల్గొని వారినందరినీ భారత్ లో పెట్టుబడులు, సంస్థలు స్థాపించేందుకు, వివిధ రకాలయిన సేవలు అందించేందుకు ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేసారు. అమెరికాలో ఉన్న భారతీయులను, అమెరికా సంస్థలను ఆయన భారతదేశంతో అనుసంధానం కోసం గట్టి ప్రయత్నాలు చేసారు.
కానీ ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ మాత్రం అమెరికాలో సంస్థలను కానీ, కనీసం అక్కడ స్థిరపడిన ప్రవాస పాకిస్తాన్ దేశస్తులతో గానీ సమావేశం అయ్యేందుకు ఆసక్తి, చొరవ చూపకుండా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో తను మాట్లాడవలసిన విషయాల గురించి ఉర్దూలో వ్రాసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారని పాక్ మీడియా ఆయన్ని ఎండగడుతూ కధనాలు ప్రచురించింది.
పాకిస్తాన్ కి చెందిన ‘ది నేషన్’ అనే ప్రముక పత్రిక మోడీ వెర్సెస్ నవాజ్ అనే హెడ్డింగ్ తో ఒక తులనాత్మక కధనం ప్రచురించింది. అందులో “మోడీని చూసి పాక్ ఏలికలు అంటే నవాజ్ షరీఫ్ చాలా నేర్చుకోవలసి ఉందని వ్రాసింది. మోడీ చాలా తెలివయిన రాజకీయ నాయకుడు. ఎంతో సమయస్పూర్తితో అందరినీ ఆకట్టుకొనేలా మాట్లాడుతూ, వ్యవహరిస్తూ తన పనిని చక్కబెట్టుకొంటారు. కానీ మన వద్ద అటువంటి లక్షణాలు ఏవీ లేవు. ఎల్లప్పుడూ అదే ఊకదంపుడు వృదా ప్రసంగాలు చేయడం తప్ప పాశ్చాత్య దేశాలకి ఆఫర్ చేసేందుకు మన నేతల వద్ద ఏమీ లేదు.”
“మోడీ చాలా చాకచక్యంగా అమెరికాను భారత్ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా కూడా ఇప్పుడు భారత్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది. క్రమంగా అమెరికా భారత్ కి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. మోడీ ప్రదర్శిస్తున్న రాజకీయ చతురతతో అమెరికాతో మనకున్న సబందబాంధవ్యాలు అన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి. ఈ పరిణామాల కారణంగా మనకున్న సైనిక సంపత్తి తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. రాజకీయంగా, రక్షణపరంగా భారత్ ని ఒక అజేయమయిన శక్తిగా మలిచేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడి ప్రయత్నిస్తున్నారు. అందుకు తగిన వ్యూహాలను ఆయన అమలు చేస్తున్నారు. కానీ మన వద్ద అటువంటి వ్యూహాలు ఏమయినా ఉన్నాయా అసలు? ఆలోచించుకొంటే మంచిది,” అని ఆ పత్రిక పేర్కొంది.