అందరూ అనుకొంటునట్లుగానే పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి మరిన్ని ఆధారాలు ఇమ్మని పాకిస్తాన్ భారత్ ని కోరింది. ఈ దాడిపై విచారణ చేయడానికి పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులతో కూడిన ‘సిట్’ భారత్ అందించిన ఐదు మోబైల్ నెంబర్లు, కాల్ డాటా, ఇతర ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసిందని, కానీ వాటి ద్వారా ఈ కుట్రకు పాల్పడిన వారేవరినీ గుర్తించలేక పోయినందున మరిన్నీ వివరాలు ఇవ్వాలని భారత్ ని కోరినట్లు తాజా సమాచారం. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న జైష్ ఏ మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్ ని ఇంకా గృహ నిర్బంధంలోనే ఉంచినట్లు పాక్ చెపుతునప్పటికీ అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు.
పఠాన్ కోట్ పై దాడి జరిగిన తరువాత భారత్, పాక్ చాలా చురుకుగా స్పందించినా ఇప్పుడు దానిపై రెండు దేశాలకు క్రమంగా ఆసక్తి తగ్గిపోయినట్లు కనబడుతోంది. ముంబై ప్రేలుళ్ళ సూత్రధారులనే ఇంతవరకు పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసి భారత్ కి అప్పగించనపుడు పఠాన్ కోట్ పై దాడికి కుట్రపన్నిన వారిని అప్పగిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. పఠాన్ కోట్ దాడి కారణంగా శాంతి చర్చలలో జాప్యం జరుగుతుండటం దురదృష్టకరమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. అంటే దానితో ముడిపెట్టకుండా భారత్-పాక్ చర్చలు మొదలుపెడితే బాగుంటుందని ఆయన సూచిస్తున్నట్లుగా భావించవచ్చును. బహుశః మరొక నెలరోజుల తరువాత భారత్ కూడా అందుకు సిద్దమవుతుందేమో? మళ్ళీ మరోసారి ఇటువంటి దాడి జరిగినప్పుడు మళ్ళీ ఇవే సీన్లు పునరావృతం చేస్తారేమో?