హైదరాబాద్: పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషరఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించటానికి లష్కరే తోయిబా వంటి తీవ్రవాద సంస్థలకు గతంలో పాకిస్తాన్ శిక్షణ ఇచ్చిందని అంగీకరించారు. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషరఫ్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. 1990 దశాబ్దంలో కాశ్మీర్లో స్వాతంత్ర్యంకోసం ఉద్యమం ప్రారంభమయిందని, లష్కరే తోయిబాతో సహా 11-12 సంస్థలు నాడు అప్పుడు ఏర్పడ్డాయని చెప్పారు. ఆ సంస్థల సభ్యులకు నాడు తాము శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఆ సమయంలో లష్కరే తోయిబా సంస్థకు చెందిన హఫీజ్ సయీద్, రెహ్మాన్ లఖ్వివంటివారు హీరోలుగా పరిగణించబడ్డారని చెప్పారు. సోవియట్ దళాలపై పోరాడటంకోసం 1979లో మతతత్వ తీవ్రవాదానికి బీజాలు వేసిందని, అదే తర్వాతి కాలంలో ఉగ్రవాదంగా మారిందని అన్నారు. తాలిబన్ ఉద్యమాన్ని ప్రారంభించింది తామేనని, రష్యాపై పోరాడటంకోసం వారిని పంపామని చెప్పారు. నాడు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి, హకానీ తమ హీరోలని, కానీ వారు తర్వాతికాలంలో విలన్లుగా మారారని ముషారఫ్ అన్నారు.