పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ఉగ్రవాదుల దాడిపై దర్యాప్తు జరిపేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జిట్) బృందం ఇటీవల పఠాన్ కోట్ వచ్చి దర్యాప్తు చేసి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముందస్తు ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఎన్.ఐ.ఏ. అధికారులు పాకిస్తాన్ కి వెళ్లి ఈ దాడికి కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న జైష్-ఏ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ని ప్రశ్నించవలసి ఉంది. జిట్ బృందం భారత్ వచ్చినప్పుడు వారి దర్యాప్తుకి అన్ని విధాల సహకరించిన ఎన్.ఐ.ఏ.అధికారులు తాము కూడా పాక్ వచ్చి దర్యాప్తు చేయాలనుకొంటున్నట్లు చెప్పారు.
అయితే ఎన్.ఐ.ఏ. అధికారులను పాకిస్తాన్ పర్యటనకి అనుమతించలేకపోవచ్చని భారత్ లోని పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ ఇవ్వాళ్ళ చల్లగా చెప్పారు. ఆయన డిల్లీలో విదేశీ మీడియాతో మాట్లాడుతూ, “ఇలాగ చెప్పడం నాకు చాలా ఇబ్బందికరంగానే ఉంది కానీ చెప్పక తప్పడం లేదు. ఈ కేసు మూలాల వరకు వెళ్లి నిజానిజాలను కనుగొనడానికే రెండు దేశాల దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి తప్ప, పాక్ దర్యాప్తు బృందం ఇక్కడికి వచ్చి వెళ్ళింది కనుక భారత్ దర్యాప్తు బృందం అక్కడికి వెళ్లి రావడానికి కాదు. ఈ కేసులో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవడమే ముఖ్యం తప్ప పర్యటనలు కాదు. మున్ముందు భారత్-పాక్ దేశాలు అన్ని విషయాలలోను సహకరించుకొంటాయని ఆశిస్తున్నాను,” అని చెప్పారు.
“అంటే భారత్ దర్యాప్తు బృందాన్ని మీ దేశంలోకి అనుమతించమని చెపుతున్నారా?” అని విలేఖరి ప్రశ్నించినపుడు “ అది మీ ఊహకే వదిలేస్తున్నాను,” అని సమాధానం చెప్పకుండా దాట వేశారు.
పాక్ దర్యాప్తు బృందం పఠాన్ కోట్ లో పర్యటించి స్వదేశం తిరిగి వెళ్ళిన తరువాత, ఆ బృందంలో ఒక అధికారి “పఠాన్ కోట్ పై భారతదేశమే స్వయంగా దాడులు జరిపించుకొని పాక్ పై నింద వేస్తోందని” పాక్ మీడియాతో చెప్పినట్లు వార్తలు వచ్చేయి. ఆ షాక్ నుంచి భారత్ తేరుకోక ముందే పాక్ మళ్ళీ ఈవిధంగా చెప్పి మరొక షాక్ ఇచ్చింది.
ఒకవేళ ఎన్.ఐ.ఏ. అధికారులను మసూద్ అజహర్ ని ప్రశ్నించడానికి అనుమతిస్తే, అతనికి పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నట్లు దృవీకరించినట్లవుతుంది. ఒకవేళ ఎన్.ఐ.ఏ. అధికారులు అతని చేత నిజం చెప్పించగలిగినా లేదా అతను ఏదయినా పొరపాటుగా వాగినా అది ఇంకా ప్రమాదం. కనుకనే పాక్ మళ్ళీ తన వక్రబుద్ధి ప్రదర్శించుకొని ఎన్.ఐ.ఏ.కి అనుమతి నిరాకరించింది.
దీని వలన భారత్-పాక్ సంబంధాలు ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉందని పాకిస్తాన్ తెలియదనుకోలేము. కానీ ఆవిధంగా దెబ్బ తినడం ఇదే మొదటిసారి కాదు…ఇదే ఆఖరిసారి కూడా కాబోదని తెలుసు కనుకనే పాక్ ఈవిధంగా వ్యవహరించగలుగుతోంది. ఒక ఆర్నెల్లో ఏడాదో భారత్ కి దూరంగా ఉంటే, మళ్ళీ భారతదేశమే స్నేహ హస్తం అందిస్తుందని పాక్ నమ్మకం. దాని నమ్మకాన్ని మన పాలకులు ఎన్నడూ కూడా వమ్ముచేయలేదు.. చేయరు కూడా.