పాకిస్తాన్ తో స్నేహం కోసం భారత్ చాలాసార్లు ప్రయత్నించింది. కానీ భారత్ పట్ల అది పెంచుకొన్న అకారణ ద్వేషం, భయాల చేత అది భారత్ ని ఎల్లప్పుడూ శత్రువుగానే భావిస్తూ, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తుంటుంది. భారత్ కి పక్కలో బల్లెంలాగ తయారైన కాశ్మీర్ వేర్పాటువాదులతో సమావేశాలు వద్దని భారత ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు.
డిల్లీలోని పాక్ హైకమీషనర్ జూన్ 25న డిల్లీలో నిర్వహించే ఇఫ్తార్ విందుకి కాశ్మీరీ వేర్పాటువాదులను ఆహ్వానించారు. హురియత్ కాన్ఫరెన్స్ నేతలు సయ్యద్ అలీ షా జిలానీ, మిర్వాజ్ ఉమర్ ఫరూక్ మరికొందరికి పాక్ హైకమీషన్ నుంచి ఇఫ్తార్ విందుకి ఆహ్వానాలు అందాయి. అది భారత ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే చర్యే. గతంలో జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఈ కారణం చేతే రద్దయింది. భారత్ తో చర్చలకి ముందు కాశ్మీరీ వేర్పాటువాదులతో సమావేశం అవుతామని పాక్ పట్టుబట్టడంతో అప్పుడు చర్చలు రద్దు అయ్యాయని పాక్ ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పుడు, మళ్ళీ అదే పొరపాటు చేయడానికి సిద్దపడుతోందంటే, భారత్ తో స్నేహసంబంధాల కంటే కశ్మీరీ వేర్పాటువాదులతో సంబంధాలకే అది అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం అవుతోంది. పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదుల దాడిని భారత్ సార్వభౌమాధికారానికి విసిరినా సవాలుగానే స్వీకరించవలసి ఉంటుంది. దానిపై కొన్ని నెలలు ఇరు దేశాలు హడావుడి చేసిన తరువాత ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. మళ్ళీ ఇప్పుడు భారత రాజధాని నడిబొడ్డునే కాశ్మీరీ వేర్పాటువాదులకి పాక్ హైకమీషనర్ ఇఫ్తార్ విందు ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు. దీనిపై విదేశాంగశాఖ నిర్ణయం తీసుకొంటుందని సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పదేపదే పాకిస్తాన్ విసురుతున్న ఈ సవాలుకి మోడీ ప్రభుత్వం శాశ్విత పరిష్కారం ఆలోచించవలసిన అవసరం ఉంది.