ఉగ్రవాదాన్ని కట్టిపెడితేనే పాక్ తో చర్చలు జరుపుతామని భారత్ మొదటి నుంచి చెపుతూనే ఉంది. మోడీ పర్యటన తరువాత ఇరుదేశాల మధ్య సహృద్భావ వాతావరణం కనిపిస్తోంది. భారత్ కోరుతున్న విధంగా ఉగ్రవాదంపై పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేందుకు సిద్దపడుతోందో ఏమో తెలియదు కానీ పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధ శాఖకు చెందిన అధికారులు నిన్న పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్కోట్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై దాడులు చేసి 8మందిని అరెస్ట్ చేసారు. వారి వద్ద నుండి బారీగా ఆయుధాలు, ల్యాప్ టాప్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ దాడిలో పట్టుబడిన యువకులు పాకిస్తాన్ లోని పంజాబ్, సియాల్కోట్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. వారు సియాల్కోట్ జిల్లా కేంద్రంలో తమ ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని, పాకిస్తాన్ అంతటా ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం నియామకాలు చేస్తున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది.
వారు పాక్ లోని ప్రజా ప్రభుత్వాన్ని కూలద్రోసి ఐసిస్ ఉగ్రవాదులు చెపుతున్న “ఖిలాఫత్” రాజ్య స్థాపన చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఇప్పటికే తాలిబన్లు, మత చాందసవాదులు, యుద్ధోన్మాదంతో రగిలిపోతున సైనిక, ఐ.ఎస్.ఐ. అధికారులతో చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. వారికి ఐసిస్ ఉగ్రవాదులు కూడా తోడయినట్లయితే ఇక పాకిస్తాన్ని రక్షించడం ఎవరివలనా సాధ్యం కాదనే భావించవచ్చును. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ మధ్య మంచి సఖ్యత ఏర్పడింది కనుక మోడీ సలహాల ప్రకారం నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల పట్ల కటినంగా వ్యవహరించగలిగితే పాక్ లో చాలా సమస్యలు పరిష్కారం అవడమే కాకుండా రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడే అవకాశాలు మరింత పెరుగుతాయి.