పఠాన్ కోట్ దాడులపై దర్యాప్తు చేయడానికి పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జిట్) ఇవ్వాళ్ళ ప్రత్యేక విమానంలో పఠాన్ కోట్ చేరుకొంది. ఊహించనివిధంగా అక్కడ వారికి స్థానిక ప్రజలు, కాంగ్రెస్, అమాద్మీ పార్టీల నుంచి నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది.
పాక్ బృందంలో ఐఎస్ఐ, పాక్ మిలటరీకి చెందిన నిఘా అధికారులు కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తులను భారత్ కి అత్యంత వ్యూహాత్మకమయిన పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్దకు అనుమతించడాన్ని కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలతో సహా చాలా మంది తప్పు పడుతున్నారు. వారి పర్యటన వలన కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోగా, వారు పఠాన్ కోట్, దాని పరిసర ప్రాంతాలను స్వయంగా కళ్ళారా చూసి, దాని గురించి మరింత అవగాహన పెంచుకొనే అవకాశం కల్పించినట్లయిందని ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పఠాన్ కోట్ పై దాడికి జైష్ ఏ-మొహమ్మద్ ఉగ్రవాదులకు ఐ.ఎస్.ఐ. అధికారులే తగిన శిక్షణ, అవసరమయిన సహాయసహకారాలు అందించినట్లు భారత్ ఆరోపిస్తున్నప్పుడు, మళ్ళీ అదే ఐ.ఎస్.ఐ.కి చెందిన అధికారిని ఏవిధంగా పఠాన్ కోట్ సందర్శనకు అనుమతించారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.
ఈ దాడిలో పాకిస్తాన్ నిర్దోషి అని నిరూపించేందుకే పాక్ జిట్ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఆ ప్రయత్నంలోనే వారిని భారత్ కూడా పంపి ఉండవచ్చని సామాన్య ప్రజలే అనుమానిస్తున్నారు. అటువంటిది మోడీ ప్రభుత్వం వారిపై ఎందుకు అంత నమ్మకం పెట్టుకొంది? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానాలు చెప్పకపోవచ్చును కానీ మున్ముందు పాక్ తప్పకుండా జవాబులు చెప్పవచ్చును. తమపై వ్యక్తం అవుతున్న ఈ అనుమానాలన్నీ నిజమేనని రుజువు చేస్తూ మాట్లాడవచ్చును. అప్పుడు పాక్ ఎత్తులకు తాము చిత్తయినట్లు మోడీ ప్రభుత్వం అంగీకరించవలసివస్తుంది.