పొగడ్తలు ఎవరికి మాత్రం చేదు చెప్పండీ..! ఒక వ్యక్తిని వీరుడూ శూరుడూ దేవుడూ అనే రేంజిలో మోసేస్తుంటే… వింటున్న ఆ వ్యక్తికి భలే మజా ఉంటుంది కదా. అయితే, ఆ మజాని ఆశ్వాదిస్తున్నట్టు అందరికీ తెలియకూడదు కదా! పొగడ్తలకి మరీ పొంగిపోకూడదు, లొంగిపోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే.. భజనని బాగానే ఎంజాయ్ చేస్తున్నారంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి, గడచిన కొద్ది నెలలుగా వరుసగా తెరాస సర్కారు చుట్టూ రకరకాల విమర్శలు ముసురుకున్నాయి. ఫిరాయింపులపై విమర్శలు, ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టు మొట్టికాయలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతిపై విమర్శలు… ఇలా తెరాస కాస్త ఉక్కిరిబిక్కిరైంది. కానీ, బడ్జెట్ తరువాత పరిస్థితి మళ్లీ మార్చేశారు కేసీఆర్! బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత అంటూ వరాలు కురిపించారు. గోదావరి జాలాలకు సంబంధించి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించారు. సో.. ఈ నిర్ణయాల నేపథ్యంలో మరోసారి కేసీఆర్ అనుకూల ప్రచారం భారీగా పెరిగింది. ఏ స్థాయిలో అంటే.. ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేసే రేంజిలో..!
ఈ మధ్య కేసీఆర్ కి పాలాభిషేకాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీటన్నింటినీ ఒక మంత్రి చేయిస్తున్నారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ పాలాభిషేకాలు ముఖ్యమంత్రి దృష్టికీ వచ్చాయనీ, ఆయన కూడా దీనికి అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. దీంతో ఇతర నాయకులు కూడా రెచ్చిపోయి పాలు పోసుస్తున్నారట! ఇలాంటి వృధా ప్రయత్నాలు కొంతమందికి ఇష్టం లేకపోయినా… ఇతర నాయకులు చేస్తున్నారు కాబట్టి, తమకీ తప్పడం లేదంటూ కొంతమంది నాయకులు ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నారట.
నిజానికి, ఇలాంటి వ్యక్తిపూజలకి సీఎం ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ, ఆయనే దీన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడం ఎంతవరకూ కరెక్ట్..? ఈ పాలాభిషేకాల వల్ల ఎంతో విలువైన పాలు అనవసరంగా నేలపాలు అవుతున్నాయి. వీటిని పేదవారికి పంచితే ఉపయోగం ఉండేది. ఈ పాలాభిషేకాల్ని సీఎం అలా డైవర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ, కేసీఆర్ తీరు అలా ఉన్నట్టు లేదే..! పొగడ్తల్ని, అభిషేకాల్నీ, భజనల్ని ప్రోత్సహించే మూడ్ లో ఉన్నట్టున్నారు. దీన్ని కూడా పార్టీ ప్రచారానికి వాడుకునేలా ఉన్నారు.