కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. వలసలతో పైకి టీఆర్ఎస్ బలం పుంజుకున్నా.. క్షేత్ర స్థాయిలో.. నియోజకవర్గాల్లో .. నేరుగా కారు గుర్తుపై మెజార్టీ సీట్లు సాధించాల్సి.. పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలతో.. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్కు సవాల్‌గా నిలిచే నేతలు.. డీకే అరుణ, రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలందరూ ఇదే జిల్లాలో పోటీ పడుతున్నారు. ఓ రకంగా నల్లగొండ తర్వతా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే కాంగ్రెస్ పార్టీకి కీలకం.
గద్వాలలో డీకే అరుణ దశాబ్దాలుగా పట్టు నిలుపుకుంటున్నారు. 2004లో చంద్రబాబును ఓడించడానికి.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ గద్వాలను.. టీఆర్ఎస్కు అప్పగించాల్సి వచ్చింది. అయితే వైఎస్ ఆశీస్సులతో.. డీకే అరుణ.. సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తపున విజయం సాధించారు. సమీప బంధువు కృష్ణమోహన్ రెడ్డినే ఆమెకు సవాల్‌గా మారారు. 2009లో టీడీపీ నుంచి, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. డీకే ఆరుణ ఆధిక్యాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ సారి గెలుపు ఖాయమనే భావనలో ఉన్నారు. కానీ.. టీఆర్ఎస్లో వరుసగా చేరిన నేతలతో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇక మలి విడత తెలంగాణ ఉద్యమానికి లేఖతో శ్రీకారం చుట్టిన చిన్నారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలోనూ.. గట్టి పోటీనే ఉంది. 1989 నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యే పదవి టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డినిగానీ..కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డిని గానీ వరిస్తూ వచ్చింది. 2014లో పరిస్థితిని గమనించి … రావుల .. చిన్నారెడ్డికి లోపాయికారీగా మద్దతివ్వడంతో.. గట్టెక్కారు. టీడీపీకి మెజార్టీ వచ్చే ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ తరపున నిరంజన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఈ సారి ఇక్కడ కాంగ్రెస్ తరపున చిన్నారెడ్డే పోటీ చేయనున్నారు. రావుల దేవరకద్ర నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
కొడంగల్ బరిలో రేవంత్ రెడ్డిని నిలువరించేందుకు టీఆర్ఎస్ ఏడాది ముందు నుంచే కసరత్తు చేస్తోంది. మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారు. భారీగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు.. నయానో భయానో కాంగ్రెస్ లోని ఓ స్థాయి నేతలందర్నీ కారెక్కించారు. అయినా రేవంత్ తన క్యాడర్ ను కాపాడుకున్నారు. టీఆర్ఎస్కు ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు ఎంత ఎక్కువగా కొడంగల్ మీద దండయాత్ర చేస్తే.. రేవంత్ కు అంత మంచి జరుగుతుందన్నప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. ఒక్కడి మీదకు అంత మందికి వస్తున్నారన్న సానుభూతి ప్రజల్లో ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో రాయలసీమ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. సంపత్ కుమార్ అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం ఖాయమే. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ చల్లా వెంకట్రామిరెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే ఎవరికి మద్దతిస్తే వారికి గెలుపు దక్కే అవకాశం ఉంది.