వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో మూడు రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు, సాక్షి మీడియాలో తెలంగాణా ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగబోయే నష్టం గురించి గణాంకాలతో సహా చాలా పెద్ద కధనాలే ప్రచురించింది. జగన్ మూడు రోజుల దీక్ష ముగిసిన తరువాత వైకాపా నేతలెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు.
ఇవ్వాళ్ళ సాక్షి తెలంగాణాలో సంచికలో “30 నెలల్లోనే పాలమూరు పూర్తి” అనే హెడ్డింగ్ తో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమావేశ వివరాల గురించి వ్రాసింది. ఆ ప్రాజెక్టును 30నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేసి అంతకంటే ముందుగానే పూర్తి చేయాలని హరీష్ రావు కోరారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లా ప్రజల, రైతుల నీటి సమస్యలు తీరుతాయని అన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికున్న అవరోధాల గురించి ఆ సమావేశంలో చర్చించారని సాక్షి పేర్కొంది.
సాక్షిలో ఈ వార్త చూస్తుంటే, రాజకీయ పార్టీలు ఏవిధంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మద్య విడిపోయారో సాక్షి మీడియా కూడా అదే విధంగా విడిపోయిందా అనే అనుమానం కలుగుతోంది. ఆంధ్రాలో సాక్షి మీడియా ఆ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కధనాలు వ్రాస్తుంటే, తెలంగాణాలో సాక్షి మీడియా ఆ ప్రాజెక్టు పురోగతి గురించి వార్తలు ప్రచురిస్తోంది. తెలంగాణాలో ఉంటూ తెలంగాణా ప్రాజెక్టులకి వ్యతిరేకంగా వార్తలు, కధనాలు వ్రాయడం సమంజసం కాదు కానీ ఆ పత్రిక యాజమాన్యం అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులని వ్యతిరేకిస్తున్నప్పుడు దాని పురోగతి గురించి సాక్షిలో వార్తలు రావడమే విచిత్రంగా ఉంది. ఒకవేళ తెలంగాణా ప్రాజెక్టులకి సాక్షి వ్యతిరేకం కాదనుకొంటే, ఆ ప్రాజెక్టు వలన తెలంగాణాకి ఎంత ప్రయోజనం కలుగుతుందో వివరిస్తూ వ్రాసి ఉంటే బాగుండేది. కానీ అలాగ కూడా వ్రాయ(లే)దు. కారణాలు అందరికీ తెలుసు.