అనూహ్య నాటకీయ పరిణామాల మధ్య బలనిరూపణ చేసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి. చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్తూ.. తన వెంట మెజారిటీ సభ్యులకు నాయకత్వం వహించమని పళని కోరడంతో.. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు చాలా సమయం ఉన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసెంబ్లీకి వచ్చేశారు. ఇక్కడి నుంచీ అసలు నాటకం మొదలైంది! రహస్య ఓటింగ్ జరపాలంటూ పన్నీర్ వర్గం పట్టుబట్టింది. ప్రతిపక్ష డీఎంకే కూడా పన్నీర్‌కు మద్దతు పలకడం విశేషం! ఈ హైడ్రామాకు భాజపా నుంచి మద్దతు లభించిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొడవ సృష్టించి బలనిరూపణ కార్యక్రమాన్ని రప్చర్ చేద్దామని ప్రయత్నించారు.
స్పీకర్‌ను అవమానించారు. బెంచీలూ కుర్చీలు పగులగొట్టేశారు. ఈ రచ్చ ద్వారా వీరు ఆశించింది ఏంటయ్యా అంటే… ఈ బలనిరూపణ అర్ధంతరంగా ఆగిపోతే, సభలో పళని బలనిరూపణ చేసుకోలేకపోయారు కాబట్టి, రాష్ట్రపతి విధించండని కేంద్రాన్ని కోరే అవకాశం కోసం వీరు వెచి చూశారు అని చెప్పొచ్చు. అయితే, ఆ ఎత్తు పారలేవు. పైగా, శశికళ వర్గం అనూహ్యంగా ఐకమత్యం ప్రదర్శించింది. దీంతో ఒకటికి రెండుసార్లు సభ వాయిదా పడ్డా కూడా, అంతిమంగా పళని స్వామికి మద్దతు లభించింది. బలనిరూపణ చేసుకున్నారు.
చిన్నమ్మ వర్గంలో ఐకమత్యం పెంచిన ఏకైక కారణం… అధికారం! తామంతా ఐకమత్యంగా ఉంటే మరో నాలుగేళ్లపాటు అధికారంలో ఉండొచ్చు. అంతే, ఇప్పుడు కట్టుతప్పితే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తాజా పరిస్థితుల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరి ఊహించలేని పరిస్థితి. కాబట్టి, ఐకమత్యంతో ఉంటే పార్టీని రక్షించుకోవచ్చనే భావం వారిలో బాగా పనిచేసిందని చెప్పాలి.
ఇక్కడితో కథ సుఖాంతం అని చెప్పలేం. ఎందుకంటే, తండ్రి దగ్గర ఎన్నోయేళ్లుగా జిత్తులూ ఎత్తులూ నేర్చుకున్న స్టాలిన్ ఇకపై కామ్‌గా ఉంటారని ఊహించలేం! ఎందుకంటే, ఆయన్ని ఎగదోసేందుకు పైన భాజపా కూడా ఉంది కదా! తమిళనాడుపై పట్టు సాధించలేకపోయామన్న ఓటమి భారంతో స్టాలిన్‌కు మద్దతుగా నిలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు! ఎలాగూ ఇకపై పన్నీర్‌కు అక్కడ సీన్ ఉండదు. సో… మున్ముందు మరిన్ని నాటకీయ పరిణామాలకు ఆస్కారం ఉందనేది విశ్లేషకుల అంచనా.