కేంద్ర ప్రకటించిన జాతీయ విద్యావిధానంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి కానీ.. తమిళనాడులో మాత్రం నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఎందుకంటే.. విద్యావిధానంలో త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించారు. ఆ త్రిభాషల్లో హిందీ ఉంది. అక్కడ హిందీ వ్యతిరేకత ఉద్యమాలు నడిచాయి. హిందీ తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు. తమిళం అస్థిత్వాన్ని దిగజార్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి.. తాము.. జాతీయ విద్యావిధానాన్ని అంగీకరించడం లేదని ప్రకటించారు. త్రిభాష సిద్దాంతాన్ని మార్చాలని నేరుగా ప్రధానినే డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్న తమిళనాడు పళనిస్వామినే నేరుగా.. జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించడంతో ఇప్పుడు అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డిపై పడింది. ఎందుకంటే.. ఆయనకు కూడా.. ఈ విద్యావిధానం నచ్చడం లేదు. ఆంధ్రుల మాతృభాష అయిన తెలుగును ఎత్తేసి ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే ఆయన పాఠశాలల్లో ఉంచాలనుకుంటున్నారు. దానికి కేంద్ర విద్యావిధానం గండికొట్టింది. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్య తప్పనిసరి చేసింది. ఆ తర్వాత విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ .. తాము ఇంగ్లిష్‌కే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కానీ.. కేంద్ర విధానాన్ని ధిక్కరిస్తామని మాత్రం చెప్పడం లేదు.
అయితే.. ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల ధిక్కార స్వరాల మధ్య కాస్తంత తేడా ఉంది. తమిళనాడు సీఎం తమ మాతృభాష కోసం పోరాడుతున్నారు. కానీ ఏపీలో మాత్రం.. మాతృభాషను అంతం చేయడానికి ధిక్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్యనే ఇంత తేడా ఉంది. తమిళం జోలికి వస్తే.. అక్కడి ప్రజలకు కులమతాలు.. పార్టీలు ఉండవు. వారంతా తిరగబడతారు. కానీ ఏపీలో భాషకు కూడా కులం అంటగట్టేసే రాజకీయాలు నడుస్తున్నాయి. జనం కూడా… తెలుగు బాష ఓ కులానిదే అనుకునేలా ప్రచారం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు ఉన్నంత కనీస మాతృభాషా మమకారం కూడా ఆంధ్రుల్లో లేదనే విమర్శలు అందుకే వస్తూంటాయి.