మండే ఎండల కాలంలో రాజకీయ వేడి రాజుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక సెగ అన్ని పార్టీలనూ ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. తనకు కలగా మిగిలిన పాలేరు సీటు కైవసం అనేది నిజం చేసుకోవాలని ప్రస్తుత తెరాస మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం రాంరెడ్డి దామోదర్ రెడ్డి భార్యనే నిలబెట్టాలని నిర్ణయించింది.
పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలోపాలేరులో మాత్రం హస్తం పార్టీదే హవా. 1972 నుంచి ఇప్పటి వరకు పాలేరులో ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగాయి. హస్తం పార్టీ తన సత్తాను చాటుతూ ఏకంతా 7 సార్లువిజయం సాధించింది. సీపీఎం రెండుసార్లు, సీపీఐ ఒకసారి గెలుపొందాయి. పాలేరు నుంచి ఎక్కువ సార్లు విజయం సాధించిన అభ్యర్థి సంభాని చంద్రశేఖర్. ఆయన కాంగ్రెస్ తరఫున మూడుసార్లు విజయబావుటా ఎగురవేశారు. ఇటీవల మరణించిన దామోదర్ రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో నెగ్గారు.
తెలుగు దేశం పార్టీకి అందని ద్రాక్షగా మారిన వాటిటో పాలేరు విజయం ఒకటి. ఎంత ప్రయత్నించినా ఇది సాధ్యం కాలేదు. అలాగే, తుమ్మల సైతం పాలేరు సీటును కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. పాలేరు టికెట్ కోసం తమ పార్టీలోనే అంతర్గత పోటీని కూడా ఎదుర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ ఓడినా, కేసీఆర్ పుణ్యమా అని గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రి అయ్యారు. ఇప్పుడు పాలేరులో గెలిచి సత్తా చాటడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం కారు జోరుకు తిరుగులేకుండా పోయింది.
ఎక్కడ ఎన్నికలు జరిగినా తెరాస జైత్రయాత్రకు డోకాలేదని కేసీఆర్ బృందం దీమాతో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఖమ్మం కార్పొషన్ దాకా అంతటా గులాబీ జెండా రెపరెపలే. కాబట్టి పాలేరులోనూ పాగా వేయడం నల్లేరు మీద నడకంటున్నారు గులాబీ లీడర్లు. కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన పాలేరులో ఒకప్పుడు కాంగ్రెస్ టికెట్ చేతిలో ఉంటే గెలిచినట్టే భావించే వారు. దామోదర్ మరణంతో కొంత సానుభూతి ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అయినా తెరాస హామీలు, ఇతరత్రా అంశాల ప్రభావాన్ని తట్టుకోవడం సాధ్యమా అనే అనుమానాలున్నాయి. ఈసారి ఈ సీటుకోసం గట్టిగా ప్రయత్నించాలని తెలుగు దేశం కూడా భావిస్తోంది. అయితే, ఎవరు గెలిచినా పరవాలేదు గానీ సైకిల్ ను తొక్కెయ్యాలనేది తెరాస పంతం. కాబట్టి, అంతిమంగా కారు గెలుపు గమ్యాన్ని చేరుతుందో లేక మరో విధంగా ఫలితం వెల్లడవుతుందో వేచి చూడాల్సిందే.