దయతో అందరూ గమనించవలసిన విషయం ఒకటున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మంత్రి వర్గ విస్తరణ చేయబోవడం లేదు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారు. ఉన్నవారిని ఉంచేసి, కొత్తవారిని జతకలిపితే మాత్రమే అది విస్తరణ అవుతుంది. కానీ.. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఖాళీలు ఆరు మాత్రమే కాగా, ఏకంగా ఛాన్స్ కొట్టగలరని అనుకుంటున్న వారి పేర్లు దాదాపు పది వరకు వినిపిస్తున్నాయి. అంటే.. విధిగా పునర్ వ్యవస్థీకరణ చేయాల్సిందే. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. పునర్ వ్యవస్థీకరణ అంటే.. ఉన్న వారిలో కొందరికి ‘ఊస్టింగ్ ఆర్డర్’ తప్పదని అర్థం.
ఆ పాయింటు దగ్గరే రకరకాల పుకార్లు పుడుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకం పుకార్లు లేవనెత్తుతున్నారు. అనంతపురం జిల్లానుంచి మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీద వేటు పడుతుందనేది ఒక వాదన. ఆ జిల్లానుంచి పరిటాల సునీత ఉన్నారు. ఆమెను తప్పించడం సీఎంకు సాధ్యం కాదని, కానీ, అదే జిల్లానుంచి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను విధిగా కేబినెట్లోకి తీసుకోవాలి గనుక, ఒకేజిల్లానుంచి ముగ్గురు లేకుండా పల్లెకు చెక్ పెడతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ రకముగా.. అందరూ కలిసి పల్లె పదవికి చెక్ ఉంటుందని ప్రచారం సాగిస్తోంటే.. సదరు పల్లె రఘునాధరెడ్డి మాత్రం ఏకంగా చంద్రబాబు పదవికే చెక్ పెట్టేస్తున్నారు.
పార్టీలో నాలుగురోజులుగా లోకేష్ భజన శృతిమించి సాగుతున్న సంగతి అందరూ గమనిస్తున్నారు. పల్లె ఒక అడుగు ముందుకేసి.. లోకేష్ సీఎం కావాల్సిన అవసరం ఉన్నదని వక్కాణించారు. లోకేష్ ఎప్పటికైనా సీఎం కావాల్సిందే.. అంటూ, తక్షణం అయితే బాగుండును అన్నంత సంకేతాలు ఇచ్చేశారు పల్లె రఘునాధరెడ్డి. సీఎం కావడానికి అన్ని అర్హతలు ఉన్న లోకేష్ ప్రస్తుతం కేబినెట్లోకి వచ్చి పని నేర్చుకోవాలిట. ఆ తర్వాత సీఎం అయిపోవచ్చునట. అంటే ఎప్పటికి? చంద్రబాబునాయుడును సీఎం కుర్చీ నుంచి గౌరవంగా ఎప్పటికి తప్పించాలని పల్లె రఘునాధరెడ్డి మనసులో ముహూర్తం పెట్టుకున్నారో తెలియడం లేదని పార్టీ ఆఫీసులో జోకులేసుకుంటున్నారు. లోకేష్‌ను మంత్రి పదవికి ఏం ఖర్మ సీఎం పదవికి అర్హుడిగా టముకు వేస్తూ ఉంటే.. భవిష్యత్తులోనైనా.. తన మంత్రిపదవిమీద వేటకత్తి వేలాడకుండా ఉంటుందని పల్లె గారి అభిప్రాయం ఏమో మరి!