ఏపీలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంటున్న కొద్దీ రాజకీయ ఉద్యమాలు కూడా పెరుగుతున్నాయి. కొత్త జిల్లాల కోసం కొందరు.. జిల్లా కేంద్రాల కోసం కొందరు గళం విప్పుతున్నారు. ఇలాంటి ఉద్యమాల్లో గుంటూరు జిల్లా పల్నాడు కాస్తంత ముందు ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నర్సరావుపేటను జిల్లాగా చేయబోతున్నారు. నర్సారావుపేట కేంద్రంగా.. పల్నాడు ప్రాంతం మొత్తం కలిపి జిల్లా అవుతుంది. ఇది పల్నాడు ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీస్తోంది. గురజాల కేంద్రంగానే పల్నాడు జిల్లా ఉండాలని.. నర్సరావుపేట కేంద్రంగా కాదని.. అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలతో కలిసి నేతలు ఉద్యమం ప్రారంభించారు. ఈ వ్య్వహారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే… మహేష్ రెడ్డి నర్సరావుపేటకు చెందిన వారు. వైసీపీ నాయకత్వం గురజాల టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ పోటీ చేసి గెలిచారు. నర్సారావుపేట ప్రజల్లోనూ జిల్లా సెంటిమెంట్ ఉంది. అక్కడ్నుంచి జిల్లా కేంద్రాన్ని తరలించి.. గురజాలలో పెట్టాలని ఆయన డిమాండ్ చేయలేరు. అలా డిమాండ్ చేస్తే నర్సరావుపేటలో వ్యతిరేకమవుతారు. డిమాండ్ చేయకపోతే.. గురజాల ప్రజల్లో చులకన అవుతారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. నర్సరావుపేటకు చెందిన వ్యక్తిని గురజాలలో ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఇప్పుడు గురజాల కేంద్రంగా జిల్లా రాలేదని.. డిమాండ్ చేయడం లేదని.. ఆయనను విమర్శించడం దండగని.. సోషల్ మీడియాలో సైటైర్లు వేస్తున్నారు.
ఆయన పల్నాడుకు చెందిన వ్యక్తి కాదన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. అదే సమయంలో.. ప్రజా సంఘాలు రోజు రోజుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తూండటంతో.. పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా కార్యక్రమం పెట్టిన రోజున.. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. కొసమెరుపేమిటంటే.. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా పెట్టాలనే డిమాండ్ మాత్రమే కాదు.. జాషువా పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయం ముందు ముందు రాజకీయాల పరంగా హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.