దగ్గర్లో ఎన్నికల్లేవ్. స్థానిక ఎన్నికలు ముగిసిచాలా కాలం అయింది. అయినా పల్నాడులో అప్పుడే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. మాచర్ల నియోజకవర్గం పట్టపగలు ఓ టీడీపీ నాయకుడి పీక కోసి చంపేశారు. ఆ వెంటనే నర్సరావుపేటలో అదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా నియోజవర్గ ఇంచార్జ్ పైనే పోలీసులు దాడులు చేశారు. సాధారణంగా ఉద్రిక్తతలు చల్లబడటానికి పోలీసులు ప్రయత్నిస్తారు. అది వారి విధి.కానీ పల్నాడులో మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. అధికార పార్టీ నేతల వాయిస్ వినిపిస్తూ పోలీసులు అనుమానాస్పద పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
చంద్రయ్య అనే టీడీపీ నేత.. వైసీపీ నేతను చంపుతానని ఎవరితోనే అన్నారని అందుకే చంపేశాడని పోలీసులు .. నిందితుల తరపు వాదనను మీడియా ముందు చెప్పారు.. ఇదే స్టోరీ ఎస్పీ మీడియాకు చెప్పక ముందే సాక్షి పత్రికలో వచ్చింది. ఇక పోలీసులపై ఎవరికీ అనుమానం రాకుండా ఎలా ఉంటుంది. ఆ తర్వాత నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఇంచార్జ్ అరవింద్ బాబు ఆందోళనకు దిగితే.. పోలీసులు బలవంతంగా.. దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. చివరికి ఆయనను పోలీసులే ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే.. అంబులెన్స్‌పై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
ఇటీవల ఎమ్మెల్యే చెప్పాడాని… ఓ రైతుపై తప్పుడు హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ కారణంగా సీఐని సస్పెండ్ చేశారు. కానీ ఎక్కడ పరువు పోతుందోనని ఆ రైతులపై హత్యాయత్నం కేసును మాత్రం వెనక్కి తీసుకోలేదు. పల్నాడులో పోలీసులు ఇలాంటి పరిస్థితుల నడుమ విధులు నిర్వహిస్తూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. పల్నాడులో ప్రత్యర్థులు పోటీ చేయకూడదన్నంత భయం కల్పించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని.. దానికి పోలీసులు సహకరిస్తున్నారన్న విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు. పోలీసులు తమ విధి నిర్వహణలో ప్రజల భద్రత, ప్రాణాల విషయంలో అయినా .. నిజాయితీగా లేకపోతే.. ప్రజాస్వామ్యానికి ఘోరమైన అన్యాయం చేసినట్లే. దాని వల్ల జరిగే దుష్పరిణామాలు భరించాల్సిన వారిలో పోలీసులు కూడా ఉంటారు.