పల్నాడులో పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. ఉదయం కాస్త ప్రశాంతంగా పోలింగ్ జరిగినా.. తమకు తేడా కొడుతుందని అంచనాకు రావడంతో మధ్యాహ్నం నుంచివైసీపీ నేతలు దాడులకు దిగారు. పల్నాడులో భయానక వాతావరణం సృష్టించి పోలింగ్ మందగించేలా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. తమకు ఓట్లు పడలేదనుకున్న చోట .. ఈవీఎంలను ధ్వంసం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు.
అయితే ఈ సమయంలో టీడీపీ నేతల నుంచి అనూహ్యమైన ప్రతిఘటన వచ్చింది. ఎలాంటిది అంటే.. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రె్డ్డి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ గ్రామం నుంచి పారిపోవాల్సి వచ్చింది. వంద మందితో ఆయన ఊళ్లోకి వచ్చి రచ్చ చేయబోతే తరిమి పంపేశారు ఆ ఊరి ప్రజలు. నర్సరావుపేట పట్టణంలో వైసీపీకి ఘోరమైన పరిస్థితి ఉందన్న రిపోర్టులు రావడంతో .. మధ్యాహ్నం నుంచి అభ్యర్థి గోపిరెడ్డి చెలరేగిపోయారు. రౌడీ మూకల్ని పురమాయించి.. టీడీపీ అభ్యర్థిపై దాడి చేయించారు. ఈ ఘటనతో ఒక్కసారి టీడీపీ నేతలు చెలరేగిపోయారు. ఎంతగా అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై నాలుగు వందల మంది టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఈ స్థాయి ప్రతిఘటన గోపిరెడ్డి కూడా ఊహించి ఉండరు.
ఇక మాచర్లలో పిన్నెల్లి దాడులు చేస్తే ఎవరూ ఎదురు చెప్పలేరనుకుకున్నారు.. కానీ పిన్నెల్లి సోదరుడ్ని ఓ చోట తరిమికొట్టారు. మాచర్ల పట్టణంలో ఓట్లు వేయకుండా చూసేందుకు అరాచకం సృష్టించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఏగ్రీవం చేసుకున్న చరిత్ర వైసీపీది. కానీై అక్కడ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓట్లేశారు. వారు ఓట్లకు రాకుండా చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ వారికీ ప్రతిఘటన తప్పలేదు.
టీడీపీ కార్యకర్తలు ఇలా తిరగబడి కొడతారని వైసీపీ నేతలు కూడా ఊహించలేకపోయారు. ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత పరిస్థితేమిటనేది వారికి ఆందోళనగా మారుతుందనడంలో సందేహం లేదు.