విదేశాల్లో దాచిన అక్రమ సంపద గురించి దేశంలోఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే వున్నాయి. నిజానికి ఇలాటి ఆరోపణలు ఇతర దేశాల్లోనూ వున్నాయి. దీనిపై మోడీ ప్రభుత్వ వాగ్దానం నెరవేరలేదు గాని సుప్రీం కోర్టు ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఇంతలోనే పనామా పేపర్స్పేరిట అంతర్జాతీయ సంచలనంగా కొన్ని లక్షల అక్రమ ఖాతాల వివరాలను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు సేకరించి విడుదల చేశారు. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆప్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) తరపున సాగిన ఈ వేటలో భారత్ నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ భాగస్వామిగా వుంది. పనామాలోని మోనికామిన్స్క్ అనే లీగల్ కన్సల్టింగ్ సంస్థ బూటకపు కంపెనీలను సృష్టించి అక్రమ ఖాతాలను కాపాడే పనిలో ఆరితేరింది. దాని దగ్గర వున్న 2,14,480 ఖాతాలను ఐసిఐజె సంపాదించగలిగింది. కోటిన్నర మందికి సంబంధించిన మొత్తాలు వాటిలో వున్నాయి. రష్యా అద్యక్షుడు వ్లదీమర్ పుతిన్, ఐస్లాండ్ ప్రధాని స్పెయిన్ అధినేతతో సహా అనేకమంది అంతర్జాతీయ నేతలు ఈ జాబితాలో వున్నారు. రష్యా ప్రభుత్వం మాత్రం ఈ కథనాలను కొట్టి పారేసింది. పుతిన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలాటి కుట్రలు ఏవో నడుస్తున్నట్టు తమకు తెలుసని అధికార ప్రతినిధి అన్నారు. కొద్ది రోజుల కిందట తలాతోక లేని ఏవో ప్రశ్నలు వస్తే తాము తోసిపారేశామని ఇప్పుడు ఈ ఆరోపణలు ప్రకటించారని ఆయన అన్నారు. మిగిలిన దేశాధినేతలు కూడా తమ లావాదేవీలలో తప్పులేదని సమర్థించుకున్నారు.
ఇక భారత్ నుంచి అమితాబ్బచన్, ఐశ్వర్యారారు, డిసిఎల్ కంపెనీ అధినేత కెపిసింగ్, ప్రముఖ న్యాయకోవిదులు హరీష్ సాల్వే, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ కుమారుడు జహంగీర్ సోరాబ్జీతో సహా డజన్ల మంది వ్యాపారవేత్తల పేర్లు వున్నాయి. మొత్తం 500 మంది భారతీయుల ఖాతాలు వెల్లడైనాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వీరి పేర్లతో పాటు ఇచ్చిన వివరణలు కూడా జోడించి కథనాలు ఇచ్చింది.
తాము విదేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తామే తప్ప కస్టమర్లు ఎందుకు వాడుకుంటారనేదానితో సంబంధం లేదని పనామాలోని మొసాక్ న్యాయసలహా సంస్థ సమర్థించుకుంది. పనామాతోపాటు కెవిన్ఐలండ్, బెర్మూడాలలో కూడా ఈ తరహా నకిలీ ఖాతాలు నడిపి పన్ను ఎగవేసినట్టు వెల్లడైంది. సుప్రీం కోర్టు దీనిపై ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అద్యక్షుడు అర్జిత్ పర్సాయత్ ఈ వివరాలు తమకు అందజేయవలసిందిగా కోరారు. ఇలాటి దుస్సాహసాలు సమస్యలు తెచ్చిపెడతాయని అక్రమ ఖాతాల స్వచ్చంద వెల్లడికి తాము ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుండేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఏమైనా ఐసిఐజె పేల్చిన ఈ బాంబు పెనుదుమారమంది.