తెలంగాణ పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు.. ఏపీ విషయంలోనూ అదే తరహా తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీకి ముగిసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. చూస్తే.. తెలంగాణలో ఎన్నికలయిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఏపీలో మాత్రం..ముందుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 12,888 గ్రామ పంచాయతీలకు 1,30,870 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది నవంబరు నుంచీ సన్నాహాలు చేసింది.
కానీ వైపు ఓటర్ల జాబితా ఖరారు కాకపోవడం, బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టు ఉత్తర్వులతో ఎన్నికల వాయిదా అనివార్యమైంది. రిజర్వేషన్లు 50శాతానికి మించ కూడదని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం కొత్త కసరత్తు మొదలు పెట్టింది. దాంతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలు ఇక వీలైనంత త్వరలో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.