పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేసినప్పటికీ.. యధావిధిగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాను ఖరారు చేస్తూ.. ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసిన ఓటర్ల జాబితానే పంచాయతీ ఎన్నికలకూ ఉపయోగించబోతున్నారు. జనవరి 15 నాటికి నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువ. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు. వీరందరూ.. మున్సిపల్ లేదా పంచాయతీ ఎన్నికలు ఏదో ఓ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ఇప్పటికే ప్రకటించింది. దాని ప్రకారం.. మొదటి నోటిఫికేషన్ పదిహేడో తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ.. షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేయడం.. ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో… ఎన్నికలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత అంటే పద్దెనిమిదో తేదీన చీఫ్ జస్టిస్ బెంచ్.. మొదటి విచారణగా… ఎస్ఈసీ రిట్ అప్పీల్పైనే విచారణ జరపనుంది. అప్పటి వరకూ.. ఓటర్ల జాబితా… ఎన్నికల కోడ్ అమలు వంటి వాటిని కొనసాగిస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది.
దేశ చరిత్రలో.. ఎన్నికల కమిషన్ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. ఓ సారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆరు నూరైనా జరిగిపోవడమే ఇప్పటి వరకూ జరిగింది. దీన్ని సెటిల్డ్ లాగా న్యాయవర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే ప్రజారోగ్యం పేరుతో హైకోర్టు న్యాయమూర్తి ఈ సెటిల్డ్ లాకు విరుద్ధంగా తీర్పు ఇవ్వడంతో… డివిజన్ బెంచ్ అయినా.. సుప్రీంకోర్టు అయినా ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తాయన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో.. ఎన్నికలు జరుగుతాయనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ప్రభుత్వ వర్గాలు కూడా అదే భావనతో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.