Pandem kodi 2 review
రేటింగ్: 2.5
‘పందెం కోడి’ – విశాల్ ఈ సినిమాని ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే విశాల్ కంటూ ఓ మార్కెట్ సృష్టించిందీ, అసలు ఆ మాటకొస్తే… విశాల్ అనే హీరో ఒకడున్నాడని చెప్పింది ఈ సినిమానే. అందుకే తన కెరీర్ గురించి ఎప్పుడు ప్రస్తావించినా… పందెం కోడి ఊసు తేకుండా ఉండడు. ‘మళ్లీ అలాంటి సినిమా చేయాలి.. అలాంటి సినిమానే చేయాలి’ అని చాలాసార్లు చెప్పాడు. ఇన్నాళ్లకు ఆ సినిమాకి సీక్వెల్ ఒకటి తీసుకొచ్చాడు. తనకు తొలి హిట్ ఇచ్చిన లింగు స్వామితోనే మళ్లీ జట్టు కట్టడం, ‘పందెం కోడి’ లాంటి పవర్ ఫుల్ టైటిల్‌ని ఎంచుకోవడంతో ‘పందెం కోడి 2’కి కావల్సినంత మైలేజీ వచ్చింది. దీన్ని విశాల్ కాపాడుకున్నాడా? పందెం కోడితో వచ్చిన ఇమేజ్.. ఆ సీక్వెల్‌తో రెట్టింపు అయ్యిందా? ఇంతకీ ఈ కోడి కథేంటి??
* కథ
రాయలసీమలోని రెండుకుటుంబాల మధ్య రాజుకున్న పగ… ఈ కథకు మూలం. ఏడు ఊర్లకు పెద్ద, రాయలసీమ దేవుడు రాజా రెడ్డి (రాజ్ కిరణ్). ఆ ప్రాంతంలోని ప్రజలకు ఆయన మాటే వేదవాక్కు. ఊరి వాళ్లంతా కలసి ప్రతీ యేడూ వీరభద్రుడి జాతర జరుపుకోవడం ఆనవాయితీ. ఓ జాతరలో జరిగిన చిన్న గొడవ.. ఆ ఊర్ల మధ్య చిచ్చు రేపుతుంది. భవానీ (వరలక్ష్మి) తన భర్తని కోల్పోతుంది. దాంతో పగతో రగిలిపోయిన భవానీ.. తన భర్తని చంపిన గోపీనీ, అతని వంశాన్నీ నాశనం చేయాలని శపథం పూనుతుంది. ఏడేళ్ల నుంచి వీరభద్రుని జాతర జరక్కుండా ఆపేస్తారు. దాంతో రాయలసీమ కరువుతో అల్లాడిపోతుంది. అక్కడ వర్షాలు పడాలంటే వీరభద్రుణ్ని శాంతింపజేయాలని, అలా జరగాలంటే.. జాతర చేయాలని నిర్ణయించుకుంటాడు రాజా రెడ్డి. అదే జాతరలో గోపీని చంపాలని పథకం వేస్తుంది భవానీ. మరి ఈసారైనా జాతర సవ్యంగా సాగిందా? రాయలసీమ ప్రతీకారాలు ఏ స్థాయిలో విజృంభించాయి? అనేదే `పందెం కోడి 2` కథ.
* విశ్లేషణ
పందెం కోడి హిట్టవ్వడానికి చాలా కారణాలున్నాయి. అది కేవలం యాక్షన్ చిత్రమే కాదు. చక్కటి లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఉన్నాయి. దానికి తోడు.. మీరా జాస్మిన్ అదరగొట్టేసింది. కథానాయిక పాత్రని ఆ తరహాలో తీర్చిదిద్దడం బహుశా అదే తొలిసారి. దాంతో ఆ పాత్ర గమ్మత్తుగా అనిపిస్తుంది. అన్నింటికంటే మించి.. అప్పట్లో విశాల్‌పై ఎలాంటి అంచనాలూ లేవు. విశాల్‌ని ఓ హీరోగా కాకుండా… సగటు మనిషిలా చూశారు. అందుకే.. తనేం చేసినా నప్పింది.. నచ్చింది. ఇప్పుడు అలా కాదు.. విశాల్‌కి ఓ గుర్తింపు ఉంది. పైగా ‘పందెంకోడి’ బ్యాగేజీ ఇంకాస్త బరువుని పెంచేదే. పందెంకోడి 2 అనగానే.. పందెం కోడికి మించిన మసాలా ఆశిస్తారు. అవన్నీ ఉన్నాయా, లేవా? అన్నది చూసుకోవాలి.
పందెంకోడిలా సీక్వెల్ కూడా `పగ`తో రగిలిపోయే కథే. యాక్షన్‌కి కావల్సినంత స్కోప్ ఉంది. దాన్ని వాడుకోవడంలో లింగుస్వామి ఎక్కడా తడబడలేదు. తొలి సగాన్ని ఫైట్లతోనే గడిపేశాడు. దాంతో.. మాస్‌కి కావల్సినంత మసాలా వాళ్లకు అక్కడే దొరికేసింది. మీరా జాస్మిన్‌కి జిరాక్స్ కాపీలాంటి పాత్ర కీర్తి సురేష్‌ది. కాకపోతే… మీరాని చూసినంత కిక్, ఆ పాత్రలో కనిపించినంత వైవిధ్యం… కీర్తిలో కనిపించవు. అయినప్పటికీ… కీర్తికున్న ఇమేజ్, తన క్యాలిబర్ ఆ పాత్రని నడిపించేశాయి. యాక్షన్‌కి తప్ప ఫన్‌కి ఏమాత్రం స్కోప్ లేని ఈసినిమాలో కీర్తినే కాస్త ఊరట అని చెప్పాలి. జాతర నేపథ్యంలో సాగిన తొలి ఫైట్ కాస్త ఆసక్తికరంగానే తీశాడు. ‘పందెం కోడి’లో ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ… పార్ట్ 2లో విశాల్ క్యారెక్టర్ని బిల్డప్ చేసిన సీన్ ఒకటి మాస్‌కి నచ్చుతుంది. స్క్రీన్ ప్లే లాకులు కూడా జాగ్రత్తగానే వేసుకున్నాడు. అయితే.. అవంతగా కిక్ ఇవ్వవు.
తన తండ్రిపై దాడి జరిగిందని తెలిస్తే.. ఏడు ఊర్లు మళ్లీ భగ్గుమంటాయని, ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసే సన్నివేశాల్లో `శ్రీనువైట్ల` మార్క్ కాస్త కనిపిస్తుంది. ఆ సన్నివేశాల్ని కాస్త ఎంటర్టైనింగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అదొక్కటి మినహాయిస్తే.. సెకండాఫ్‌లో పెద్దగా మెరుపులు కనిపించవు. క్లైమాక్స్ లో వరలక్ష్మి చేత వీర విహారం చేయించాలని చూశారు. ఓ సందర్భంలో వరలక్ష్మి విశాల్‌ని ఎగిరి తన్నుతుంది కూడా. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి విశాల్ లాంటి మాస్ హీరోకి ఎన్ని గట్స్ కావాలో..?? మొత్తానికి అలాంటి క్రూరత్వం నిండిన పాత్రలోనూ మార్పు తెప్పించి ఈ కథని డ్రమెటిక్‌గా ముగించాడు.
* నటీనటులు
విశాల్ ఎప్పటిలానే నటించాడు. తన వరకూ ప్లస్సులు, మైనస్సులూ కనిపించవు. వరలక్ష్మితో తన్నించుకునే గట్స్ ఉన్నందుకు విశాల్‌ని మెచ్చుకోవాలి. కీర్తిని ఈ తరహా పాత్రల్లో చూడడం కష్టమేమో. చాలా మాసీగా కనిపించింది. మహానటిలో చూసిన నటి ఈమేనా అన్నట్టుంది. ఈసారీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం సంతోషించదగిన విషయం. వరలక్ష్మి షాక్ ఇస్తుంది. అయితే ఈ పాత్ర నుంచి కూడా మరీ అంత ఎక్కువ ఆశించకుంటే మంచిది. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉన్న సినిమా ఇది. కనీసం కొంతమంది నటీనటులనైనా తెలుగు నుంచి తీసుకుంటే బాగుండేది. తమిళ వాళ్లకి చెప్పిన డబ్బింగ్ కుదరకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది.
* సాంకేతిక వర్గం
ఓ జాతర నేపథ్యంలో సాగే సినిమా. సినిమా అంతా డప్పుల మోత వినిపిస్తూనే ఉంటుంది. పాత్రల వాచకం, కట్టూ బొట్టూ, సంప్రదాయాలూ… ఇవన్నీ చూస్తుంటే అచ్చమైన తమిళ సినిమా సబ్ టైటిల్స్‌తో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలూ, నేపథ్య సంగీతం… అన్నింట్లోనూ హోరే. ఫైట్లని మాత్రం రసవత్తరంగా తీర్చిదిద్దారు. లింగుస్వామి రాసుకున్న కథలో ఏమాత్రం వైవిధ్యం లేదు. కేవలం మాస్ ఎలిమెంట్స్‌ని నమ్ముకుని తీసిన సినిమా ఇది.
* తీర్పు
సీక్వెళ్లు అన్నిసార్లూ వర్కవుట్ అవ్వవు. ఓ సూపర్ హిట్ సినిమా పేరుని మళ్లీ వాడుకోవాలంటే… కథలో ఆ స్థాయి దమ్ము ఉండాలి. టైటిల్‌నీ, కాంబినేషన్‌నీ నమ్ముకుని తీసిన సినిమా ఇది. అక్కడక్కడ లింగు స్వామి మార్క్ సన్నివేశాలు.. ఉత్కంఠతకు రేకెత్తిస్తాయి. `ఫైట్ల కోసమే` అనుకుంటే.. `పందెంకోడి` మాస్‌కి నచ్చుతుంది. అంతకు మించి ఆశిస్తే. మాత్రం కష్టమే.
* ఫైనల్ టచ్: ‘నాటు’ కోడి
రేటింగ్: 2.5