ఓపీఎస్‌పై మళ్ళీ పన్నీటి జల్లు కురిసింది. మూడోసారి ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. జయలలితను ఆపదలో ఆదుకున్న నాయకుడిగా ఆయనకు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. కోర్టు తీర్పులు ఆమెకు వ్యతిరేకంగా వచ్చినప్పుడల్లా ఆమె పన్నీర్నే నమ్మేవారు. పార్టీలో ఆమెకు ఆయనకు మించిన విశ్వసనీయులు కనిపంచలేదు. ఈసారి సందర్భం వేరు. రాజకీయ వర్గాల పోరులో భాగంగా శశికళ, దినకరన్ వర్గాలను పార్టీ నుంచి గెంటేంసేందుకు అన్నా డీఎంకేకు చెందిన ముఖ్యమంత్రి ఈపీఎస్, ఓపీఎస్లు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో ఆడిన నాటకమిది. ఆదినుంచి అవినీతిని దునుమాడతానని చెప్పుకొస్తున్న బీజేపీ అధినాయకత్వం.. చర్యల మాటెలా ఉన్నా.. అవినీతిపై నిప్పులు చెరుగుతూనే ఉంది. ఆదాయానికి మించిన ఆస్తలు కేసులో శశికళ జైలుకెళ్ళాల్సి రావడంతో ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆమె కలలు జైలు పాలయ్యాయి. ఇది పథకం ప్రకారం పన్నిన వ్యూహం. ఇందులో శశికళ అండ్ కో దారుణంగా ఇరుక్కుపోయారు. అద్వితీయమైన బీజేపీ కేంద్ర నాయకత్వ ఎత్తులను కనీసం ఊహించే స్థాయి కూడా వారికి లేదు. పైగా అవినీతి కేసులు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారెవరికైనా అది చాలదా? ఓ ఆటాడించడానికి. కానీ అందుకు కీలు బొమ్మలు కావాలిగా. పన్నీర్ సెల్వం అనే రూపంలో ఓ కీలుబొమ్మ ఎలాగూ ఉండనే ఉంది. అధికారంలో ఉండడమే ఆయన పరమావధి. అదే బీజేపీకి ప్రణాళికను ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవి ఆశచూపి, తొలుత ఆడించాలనుకున్నారు. కానీ, మన్నార్గుడి మాఫియా ముందు ఆ ఆటలు సాగలేదు. అదే సమయంలో కోర్టు తీర్పు రావడం కేంద్రానికి వరంలా పరిణమించింది. శశికళ లోపలకు వెళ్ళడం.. ముఖ్యమంత్రి కావాలనుకున్న దినకరన్కూడా ఊచలు లెక్కపెట్టాల్సి రావడంతో సీఎం పీఠం ఎక్కే అదృష్టం పళని సామికి దక్కింది. అయితే ఆయన దినకరన్ గుప్పెట్లో ఉన్నట్లే కనిపించారు. ఇక్కడే బీజేపీ అసలు ఎత్తు వేసింది. పన్నీర్ సెల్వంను రెచ్చగొట్టింది. జయలలిత మృతిపై విచారణతో పాటు, పోయెస్ గార్డెన్‌ను జయలలిత స్మారక భవనంగా మార్చాలనీ ఆయన డిమాండ్. పదవి కాపాడుకోడానికి పళనికి దిగిరాక తప్పింది కాదు. దినకరన్‌ను పార్టీలో కొనసాగనిస్తే.. ఎప్పటికైనా ముప్పే. అందుకే రెండు వర్గాలూ కూడబలుక్కున్నాయి. జయలలిత మృతిపై విచారణకు ఆదేశించి, విలీనానికి బాటలు వేశాయి. పన్నీర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవినీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవినీ కట్టబెట్టేందుకు అంగీకారం కుదిరింది. దీనికి ముందు స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు వీరిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీతో రెండు మూడు సార్లు సమావేశమయ్యారు. అందులోనే అన్నా డీఎంకే పిట్లల పోరు తీరిందని వేరే చెప్పాల్సిన అవసరం లేదుగా..! ఇక తమిళనాడులో బలపడేందుకు బీజేపీకి మార్గం సుగమమైనట్లే. పేరుకు అన్నాడీఎంకేనే.. అధికారం చెలాయించేది మాత్రం బీజేపీ… బీహర్‌లో మాదిరిగానన్నమాట.
-సుమ