పన్నీర్ సెల్వమ్… ముఖ్యమంత్రి పీఠాన్ని చేజార్చుకున్న మాజీ ముఖ్యమంత్రి! సీటు చేజారిన దగ్గర నుంచీ పట్టువదలని విక్రమార్కుడిలా రకరకాల ప్రయత్నాలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆయన సీన్ అయిపోయిందీ… ఇక విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం అని చాలామంది అనుకున్నారు! కానీ, ఆయన మాత్రం రకరకాల వ్యూహాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎలాగైనా సరే, పళనిస్వామి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్నది పన్నీర్ ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకే, ఇప్పుడు అమ్మ సెంటిమెంట్‌ను ఇంకో యాంగిల్లో రెచ్చగొట్టి… ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఈనెల 6 నుంచి చెన్నైలో నిరాహార దీక్ష చేసేందుకు పన్నీర్ సిద్ధమైతున్నారు.
ఇంతకీ ఈ దీక్ష ఎందుకయ్యా అంటే… అమ్మ మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయట! వాటిని నివృత్తి చేసేందుకు సమగ్ర దర్యాప్తు వెంటనే జరగాలట! జయ మరణంపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ పన్నీర్ దీక్షకు దిగబోతున్నారు. అమ్మ మరణించిన ఇన్నాళ్లకు ఈ టాపిక్ ఆయనకు గుర్తొచ్చిందా అనేది అసలు ప్రశ్న..? ఇదే టాపిక్ ఆయన ఎందుకు ఎంచుకున్నారంటే… అమ్మ మరణంపై తమిళ ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆమె ఆసుపత్రి పాలైన దగ్గర నుంచీ అంతా గోప్యంగా ఉంచారు. అమ్మకు చేసిన అనారోగ్యం ఏంటో బాహ్య ప్రపంచానికి తెలీదు! ఆమె మరణానికి దారితీసిన ఆరోగ్య స్థితిగతులు ఏంటో అపోలో ఆసుపత్రి గోడలు దాటి బయటకి రాలేదు. ఇలా అమ్మ మరణం చుట్టూ చాలా ప్రశ్నలున్నాయి. సో.. ఇదే టాపిక్ మీద దీక్షకు దిగితే ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు అవకాశం ఉంటుందని పన్నీర్ భావించి ఉంటారు.
నిజానికి, పన్నీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమ్మ మరణంపై సీబీఐ విచారణ కోరారు. మరి, ఇప్పుడు పళనిస్వామి సర్కారు ఈ డిమాండ్‌పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఒకటి మాత్రం సుస్పష్టం… చిన్నమ్మ వర్గాన్ని నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదనే విషయం పన్నీరును నడిపిస్తున్న పెద్దలకీ అర్థమైంది. తమిళనాడులో మున్నార్ గుడీ మాఫియాను ఎదుర్కొనే దమ్ము సోలోగా పన్నీరుకు లేదన్నది ఢిల్లీ పెద్దలకి స్పష్టమైంది. అలాగే, అమ్మ జయలలిత స్థాయిలో పన్నీరుకి ప్రజాకర్షణ కూడా లేదన్నది వాస్తవం.
కాబట్టి, ఇక మిగిలిందంతా అమ్మ సెంటిమెంట్‌ను వాడుకోవడం మాత్రమే! అందుకే, అమ్మ మరణంపై తమిళనాడులో కొత్త చర్చకు పన్నీరు తెర లేపుతున్నారు. పన్నీరు దీక్ష వెనక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, పన్నీరును నడిపిస్తున్నది భాజపా అనే అభిప్రాయం తమిళనాట బాగానే వ్యాపించి ఉంది. ఈనేపథ్యంలో పన్నీరు దీక్షకు స్పందన మిశ్రమంగా ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.