సినిమాలు వేరు రాజకీయాలు వేరు. సినిమాల్లో స్టార్ గా ఉన్నంత కాలం ఎలాంటి గొడవా ఉండదు. ఒక్కసారి పాలిటిక్స్ లోకి అడుగు పెడితే.. విపక్షాల విసుర్లు, విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఎంతటి స్టార్ అయినా వాళ్లపై బురద చల్లడానికో, బద్నాం చేయడానికో, లేదంటే పరువు పీకి పందిరి వేయడానికో చాలామంది కాచుకొని కూర్చుంటారు. ఆ సెగ ఎలా ఉంటుందో తమిళ స్టార్ విజయ్‌కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. సినిమా రంగంలో స్టార్ గా వెలిగి, మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2026లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది. ఈ ఎన్నికల కోసం విజయ్ సమాయాత్తం అవుతున్నాడు. విజయ్‌ని, అతని ఇమేజ్‌నీ అవహేళన చేసి మానసికంగా తనని దెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విజయ్‌పై తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఓ సభలో పన్నీర్ సెల్వం మాట్లాడుతూ ”విజయ్ పార్టీ పేరు TVK అంటే ఏమిటో చెప్పాలి” అంటూ ఆయన అభిమానుల్ని కోరారు. దానికి వెంటనే త్రిష – విజయ్ – కీర్తి సురేష్ అని సమాధానం ఇచ్చారు. దాంతో మంత్రి ”మీరంతా తెలివైన వాళ్లు” అంటూ వాళ్లని మరింత ఉత్సాహ పరిచారు. ప్రస్తుతం ఈ కామెంట్లు తమిళ నాట చర్చనీయాంశమయ్యాయి. విజయ్ పార్టీకి త్రిష, కీర్తి సురేష్‌లకు సంబంధం ఏమిటి? అంటూ అక్కడి వాళ్లు ఆరా తీస్తున్నారు. విజయ్ కు త్రిష, కీర్తిలతో ఎఫైర్ ఉందని, అందుకే మంత్రి ఇలా విజయ్‌ని ఎద్దేవా చేశారని ఓ వర్గం గుసగుసలాడుతోంది. తమిళనాట సోషల్ మీడియాలో ఈ వార్తే హల్ చల్ చేస్తోంది. దీనికి విజయ్ కూడా గట్టిగా రిప్లై ఇవ్వబోతున్నాడని అక్కడి పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లోకి దిగాక ఇలాంటి విమర్శల్ని ఎదుర్కోవడం మామూలే అని, విజయ్ తన కార్యాచరణపై దృష్టి పెడితే బాగుంటుందని, తాను అధికారంలోకి వస్తే, ప్రజలకు ఏం చేయగలడో, మిగిలిన పార్టీలకు తన పార్టీకీ ఉన్న వ్యత్యాసం ఏమిటో విజయ్ చెబితే సరిపోతుందని, ఇలాంటి విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది సలహా ఇస్తున్నారు.