చిరుత పులి… దీన్ని చూస్తేనే హడల్. ఒక్కసారి గర్జిస్తేచాలు గుండెలు ఆగిపోవాల్సిందే. అడవిలో కింగ్ లా తిరిగే ఒక చిరుతకు టైమ్ బాగోలేక ఇలా బిందెలో తలదూర్చేసి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. చివరకు అటవిశాఖ సిబ్బంది దాన్ని పట్టుకుని ఆస్పత్రికి తీసువెళితే మత్తు మందు ఇచ్చి ఎలాగో బిందెను తొలగించి చిరుతకు స్వేచ్ఛ ప్రసాదించారు.
రాజస్థాన్ లో ధులీ కాన్ అనే గ్రామంలో ఒక పొలందగ్గర సంచరిస్తున్న చిరుత పులి బాగా దాహంతో ఉంది. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయోమోనని చుట్టూ చూసింది. అంతలో అక్కడో స్టీల్ బిందెకనిపించింది. లోపలకు తొంగిచూసింది. అడుగున నీళ్లు కనిపించాయి. వెంటనే ఆలస్యంచేయకుండా తలకాయ దూర్చి నీళ్లు తాగబోయింది. కానీ ఈలోగా బిందెలో చిరుత తలకాయ ఇరుక్కుపోయింది. అంతే బిందెలో నుంచి తలకాయ బయటకురాక నానా అవస్థపడింది. బాధతో పిచ్చెక్కినట్టు తిరగాడింది. దాని అవస్థ చూసిన గ్రామస్థులు ఈ విషయం అటవీశాఖ సిబ్బందికి చెప్పారు. వారు వచ్చి, మొత్తానికి చిరుతను మత్తు ఇంజెక్షన్ల సాయంతో బంధించి చేరువలోని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ దానికి మరింత మత్తుఇచ్చి, కట్టర్స్ ఉపయోగించి బిందెను కోసి చిరుతతలను క్షేమంగా బయటకు తీశారు. మత్తు వదిలినతర్వాత చిరుత తన గండం గట్టెక్కినందుకు తెగ ఆనందపడి మళ్ళీ యధాప్రకారం అడవిలోకి వెళ్ళిపోయింది.
నీతి : ఈ యదార్థ సంఘటన వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి? కాలం కలసిరాకపోతే ఎంతటివారైనా బిందెలో తలకాయదూర్చిన చిరుతపులిలా అవస్థలు పడతారన్నమాట.