తెలుగు360 రేటింగ్: 2.25
ఓ రాజుగారికి ఏడుగురు కొడుకులు
వాళ్లంతా వేటకు వెళ్లారు
ఏడు చేపలు తెచ్చారు..
….. ఈ కథ ఎంత రొటీన్‌గా అనిపిస్తుందో…
ఓ పేదింటి అబ్బాయి
ఓ గొప్పింటి అమ్మాయి
ఇద్దరూ ప్రేమించుకున్నారు
ఇంట్లో ‘నో’ చెప్పారు..
….. ఈ కథ అంతకంటే రొటీన్‌గా అనిపిస్తుంది.
అయినా మన తాతలు ఏడు చేపల కథలు చెప్పడం ఆపరు
మన దర్శకులు తోటలో రాజు – కోటలో రాణి కథలు తీయడం ఆపరు. అదేంటని అడిగితే ‘ఎలాంటి కథ ఎంచుకున్నాం అన్నది కాదు, ఎలా చెప్పాం? అన్నదే పాయింటు’ అంటారు. అదీ నిజమే. కథలో కాదు దాన్ని తీసిన విధానంలో కొత్తదనం ఉంటే సక్సెస్ కొట్టేసినట్టే. ‘పేపర్ బాయ్’ కూడా అలాంటి రాజు – పేద లవ్‌స్టోరీనే. మరి సంపత్‌నంది కొత్తగా ఏం రాశాడు? కొత్తగా ఎలా తీయగలిగాడు?
కథ
కథ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అచ్చంగా మనకు బాగా తెలిసిన, ఓ విధంగా అరిగిపోయిన కథ. ఓ పేదింటి అబ్బాయి (సంతోష్ శోభన్)… గొప్పింటి అమ్మాయి (రియా సుమన్)ని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా తనకి మనసిస్తుంది. ప్రేమకు మనసులు ఇచ్చిపుచ్చుకుంటే సరిపోదు. అభిరుచులు కలిస్తే సరిపోదు. హోదాలు కూడా కలవాలి. ఆ హోదానే వాళ్లిద్దరికీ అడ్డొస్తుంది. అదెలా? ఎవరి వల్ల? తరవాత ఏం జరిగింది? అనేదే కథ.
విశ్లేషణ
కథ రొటీన్‌గా ఉన్నా – దాన్ని నడిపించే కథనం మాత్రం కొత్తగా ఉండాలి. ఇదీ అసలు సిసలైన సినిమా రూలు. దాన్ని సంపత్‌నంది అండ్ కో పాటించినట్టే కనిపించింది. ఈ రొటీన్ పేపర్ బోయ్ కథని.. ఎక్కడో ముంబైలో ఓ అమ్మాయి డైరీ చదవడంతో మొదలెట్టారు. డైరీ లోంచి కథ మొదలయ్యే స్క్రీన్ ప్లే… మరీ కొత్తది కాదు. కాకపోతే.. మరీ రొటీన్‌గా మొదలెట్టకుండా కాస్త ఉపశమనం కలిగించారు. అయితే ఆ తరవాత జరిగే సన్నివేశాలన్నీ రొటీన్‌గా ఉంటాయి. పేపర్ బోయ్ని గొప్పింటి అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది? అతని వ్యక్తిత్వం నచ్చడం వల్ల. అందుకే హీరో వ్యక్తిత్వాన్ని ఓ రేంజులో చూపించడం మొదలెడతారు. పుస్తకాల్లోంచి, అక్షరాల్లోంచి ప్రేమ పుట్టినట్టు చూపించి కాస్త భావాత్మక సన్నివేశాలు రాసుకున్నాడు. అవన్నీ బాగానే అనిపిస్తాయి. పేపర్లోని కొన్ని పదాలు అండర్లైన్ చేస్తూ.. హీరోయిన్‌కి తన భావాలు చెప్పడానికి చేసే ప్రయత్నాలు… అక్కడక్కడ బాగున్నట్టు అనిపించాయి. ఏ కథకైనా విశ్రాంతి దగ్గర కన్ఫ్లిక్ట్ కావాలి. అక్కడి నుంచి ఓ సంఘర్షణ మొదలవ్వాలి. అయితే అది కథలోంచి అంతర్భాగంగా పుట్టుకుని రావాలి. `పేపర్ బోయ్`లో ఆ సంఘర్షణ మాత్రం కావాలని పనిగట్టుకుని రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్ పెళ్లి పార్టీలో.. హీరో హీరోయిన్ల మధ్య దూరం పెంచడానికి చేసిన ప్రయత్నం… బలవంతపు సన్నివేశమే.
అందుకు తగ్గట్టుగానే సెకండాఫ్మొదలవ్వగానే.. హీరో తన తప్పు తెలుసుకుని `సారీ` చెప్పేనట్టు రాసుకున్నారు. అంటే. ఆ కాన్ఫ్లిక్ట్ ఈ కథకు సరిపడదని… దర్శకుడు, కథకుడు ముందే గ్రహించేశారన్నమాట. అన్నీ పాజిటీవ్పాత్రలే అయితే… కథలో సంఘర్షణ ఎక్కడ పుడుతుంది? అందుకే హీరోయిన్ అన్నయ్యలను రంగంలోకి దింపాడు. వాళ్లిద్దరూ హీరో ఇంటికి వెళ్లి…. మాట్లాడే మాటలు, తడి గుడ్డతో గొంతులు కోసేంత ప్రశాంతంగా ఉంటాయి. రచయితగా సంపత్ నంది క్యాపబులిటీ, దర్శకుడుగా జయ శంకర్ కెపాసిటీ ఆ సీన్లో తెలిశాయి. రక్తం లేకుండా, హింస లేకుండా చాలా బాగా డీల్ చేశాడు ఆ సీన్‌ని. అలాంటి సన్నివేశాలు, ఆ స్థాయి ఇంకెక్కడా కనిపించకపోయేసరికి సెకండాఫ్ పట్టు తప్పుతుంది. సెకండాఫ్‌లో హీరో చేసేదేం ఉండదు. హీరోయిన్‌కీ ఆ ఛాన్స్ రాదు. అందుకే బిత్తిరి సత్తిని రంగంలోకి దింపి స్నూఫ్‌లు చేయించారు. అది బీసీ సెంటర్ల ఆడియన్స్‌ని అలరిస్తే అలరించొచ్చు గాక… కానీ ఇంత ప్లజెంట్ మూవీలో.. ఆయా సన్నివేశాలు అడ్డే. క్లైమాక్స్ కూడా ఇరికించినట్టే అనిపిస్తుంది. తమిళ సినిమాల టైపులో వాస్తవిక కోణంలో ఈ సినిమాని ముగించగలిగితే… ఇంకోలా ఉండేదేమో. ఇక్కడన్నీ హ్యాపీ ఎండింగ్సే వర్కవుట్ అవుతాయని భావించి.. ఆ ధైర్యం చేయలేకపోయారేమో.
నటీనటులు
సంతోష్ సహజంగా కనిపించాడు. పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు. నటన కూడా అంతే. అయితే.. అక్కడక్కడ కాస్త శ్రుతిమించాడు. మరీ ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్ లో. అండర్‌ప్లే చేయాల్సిన చోట కూడా ఏదో ఏదో చేయాలని తపన పడినట్టు అనిపించింది. ఆ యాటిట్యూడ్ కాస్త తగ్గించుకుంటే ఇంకా మెరుగవుతాడు. సంతోష్ కాకుండా మరో నటుడు ఉండి ఉంటే.. అనే భావన సినిమా చూసిన ప్రేక్షకుడికి కలిగితే.. అది అతని తప్పు కాదు. రియా సుమన్ అందంగా ఉంది. బాగా చేసింది. తాన్య కూడా అంతే. అక్కడక్కడ తమన్నాని చూసినట్టు అనిపిస్తుంది. బిత్తిరి సత్తి పాత్రని కామెడీ సీన్ల కోసం తీసుకొచ్చారు. కానీ ఆయన చేసిందేం లేదు. మిగిలిన వాళ్లలో తెలిసిన మొహాలు చాలా తక్కువ. హీరోయిన్ సోదరుల పాత్రలతో సహా.
సాంకేతికంగా
టెక్నికల్‌గా ఎంత చేయాలో అంతా చేశారు ఈ సినిమాకి. మరీ ముఖ్యంగా సౌందర రాజన్ ఫొటోగ్రఫీ చాలా చాలా అందంగా ఉంది. ప్రతీ సీన్‌ని ఓ రంగుల హరివిల్లులా చూపించారు. తెరపై అందమైన కథానాయిక ఉన్నా.. చూపు మాత్రం పక్కకు పోతుంటుంది. లొకేషన్లు, వాటిలో వాడిన కలర్స్ అంత బాగున్నాయి. ఓ విధంగా సన్నివేశాన్ని డామినేట్ చేసేశాయి కూడా. సంపత్ నంది అందించిన సంభాషణలు మరో ప్రధాన ఆకర్షణ. దాదాపు ప్రతీ సీన్లోనూ ఓ మంచి డైలాగైనా వినిపిస్తుంటుంది. పాటలు అర్థవంతంగా ఉన్నాయి. తెలంగాణ ఫోక్ అయితే మాస్‌కి నచ్చుతుంది.
తీర్పు :
హంగులన్నీ బాగున్నా.. పునాది లాంటి కథ మరీ పాతది ఎంచుకోవడంతో ఇబ్బంది మొదలైంది. కథలో ఉన్న ఎమోషన్‌కి ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోవడానికి అదే ప్రధానమైన కారణం. ఇదే ఎఫెక్ట్ ఓ మాదిరి కథకు పెట్టి ఉంటే… కచ్చితంగా ఫలితం దక్కేది. పేపర్ ఎంత తళతళలాడినా.. న్యూస్ పాతదైతే ఏం లాభం?? పేపర్‌బాయ్ విషయంలోనూ అదే జరిగింది.
ఫైనల్ టచ్: పేపర్ బాగుంది.. వార్తలే బోర్
తెలుగు360 రేటింగ్: 2.25