ఏ ప్రేమ కథైనా ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కాబట్టి. అందుకే ధనిక – పేద మధ్య ఎన్ని ప్రేమకథలు పుట్టుకొచ్చినా చూస్తూనే ఉంటాం. వాటి మధ్య ఘర్షణని, ఎడబాటునీ, తడబాటునీ, వాటన్నింటినీ జయించి మళ్లీ కలసిన మనసుల్నీ చూస్తూనే ఉంటాం. `పేపర్ బోయ్` కూడా అలాంటి కథే. సంపత్ నంది నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. సంతోష్ శోభన్ రియా సుమన్లు జంటగా నటించారు. ట్రైలర్లోనే కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఓ పేపర్ బోయ్ కీ, ఓ గొప్పింటి అమ్మాయికీ మధ్య నడిచే ప్రేమ కథ ఇది. చెప్పుకోవడానికి రొటీన్ గానే ఉన్నా… దాన్ని కవితాత్మకంగా తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మాటలు బాగున్నాయి. అందులో డెప్త్ ఉంది
- ధరణి… నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడక్షరాలు
- పరిచమైంది పుస్తకాల్లో… దగ్గరైంది అక్షరాల్లో
- ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది.. అది కనిపించదు – కానీ బతికిస్తుంది
- ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదనుకున్నా. కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది
- ముద్దు పెట్టుకోవడమంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం
– ఇలాంటి డైలాగులు ఈ ట్రైలర్లో ఆకట్టుకున్నాయి. విజువల్స్, వాటిలో కనిపించిన కలర్స్.. ఇవన్నీ చూడముచ్చటగా ఉన్నాయి. రొటీన్ స్టోరీ అయినా, దాన్ని సరికొత్తగా తెరకెక్కించారన్న నమ్మకం కలుగుతోంది. సెన్సిటీవ్ ప్రేమకథల్ని ఆదరిస్తున్న ఈ తరుణం.. పేపర్ బోయ్కి కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ట్రైలర్లో ఆకట్టుకున్న ఈ లవర్ బోయ్.. వెండి తెరపై ఏం చేస్తాడో చూడాలి.