లిక్కర్ స్కామ్లో కవిత తీవ్రంగా ఇబ్బంది పడుతూంటే.. కేటీఆర్కు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయం ఇబ్బందికరంగా మారింది. తనపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఐటీ మంత్రినైనంత మాత్రాన అన్ని కంప్యూటర్లు తన చేతిలో ఉంటాయా అని ప్రశ్నించారు . కేటీఆర్ పరీక్షా పత్రాల లీక్ విషయంలో ఎదురుదాడి చేశానని అనుకున్నారు కానీ.. ప్రజల్లో మాత్రం కాస్త తేడాగా ప్రచారం జరుగుతోంది.
అందుకే విపక్షాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అందుకున్నారు . కేటీఆర్ పీఏ తిరుపతి గురించి రేవంత్ ఆరోపించారు. ఆయన ఊరి వాళ్ల పేపర్లు, మార్కులు బయటకు తీయాలంటున్నారు. బండిసంజయ్ కూడా టీఆర్ఎస్ నేతల పిల్లలకే ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపించారు. ఆ లెక్కలు తీయాలంటున్నారు. వీరు డిమాండ్ చెప్పినట్లుగా వివరాలు బయట పెడితే ఓ సమస్య… బయట పెట్టకపోతే మరో సమస్య వచ్చి పడుతుంది.
అధికారంలో ఉన్నపార్టీగా.. సీఎం తర్వాత సీఎం అంతటి పవర్ ఫుల్గా ఉన్న కేటీఆర్… ఈ పేపర్ లీకేజీ అంశంలో తన బాధ్యతను పూర్తిగా మర్చిపోయారు. అధికారంలో ఉన్న పార్టీగా బాధ్యత గుర్తుంచుకుని వ్యవహరించాల్సింది పోయి.. మాకేం సంబంధం అన్నట్లుగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సారి పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఉద్యమ ఎజెండాలోనే ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు నమ్మారు. ఎనిమిదేళ్ల పాటు ఎదురు చూసి ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూంటే.. అడ్డగోలుగా తన్నుకుపోతున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
టీఆర్ఎస్ రాజకీయంలో కానీ బీఆర్ఎస్ రాజకీయంలో కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర పక్షాలను ఇబ్బంది పెట్టడం తప్ప.. బీఆర్ఎస్ ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఓ అజెండాను సెట్ చేయడం తప్ప.. తాము ఫాలో అయింది లేదు . కానీ తొలి సారి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నట్లయింది. ఎన్నికలకు ముందు ఇలా జరుగుతూండటం ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతోంది.