తెలుగు రాష్ట్రాల్లో మేధావిగా పరిగణించదగ్గ వ్యక్తులలో పరకాల ప్రభాకర్ మొదటి స్థానంలో ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై “రాజధాని విషాదం” డాక్యుమెంటరీ సిద్ధం చేశారు. వివిధ నగరాల్లో జర్నలిస్టులకు.., ప్రముఖులకు ప్రదర్శించి.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచారు. “రాజధాని విషాదం” అంటే.. అదేదో అమరావతికి మద్దతుగా చేసిన డాక్యుమెంటరీ అనే ప్రచారాన్ని కొంత మంది ప్రారంభించేశారు. అమరావతిపై కొంత కాలంగా జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని ఈ డాక్యుమెంటరీపైనా చేస్తున్నారు. కానీ.. కాస్త కళ్లు తెరుచుకుని చూస్తే.. “రాజధాని విషాదం” సగటు ఆంధ్రుడ్ని ఎంతగా మనోవేదనకు గురి చేస్తోందో పరకాల చాలా వివరంగా తన డాక్యుమెంటరీలో దృశ్యీకరించారు.
ఆంధ్రుల రాజధాని పయనం.. అంటే చెన్నపట్నం , కర్నూల్, హైదరాబాద్, అమరావతి గురించి పరకాల డాక్యుమెంటరీలో ప్రస్తావించారు. ఆంధ్రులకు మొదటినుండి రాజధాని ఒక విషాదమే. అందులో అనుమానం లేదు. ఆ విషయాన్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన అమరావతిని ఎక్కడా సమర్థించలేదు. జరిగిన విషయాన్ని మాత్రం చెప్పారు. అమరావతిలో రాజధానికి భూసమీకరణ సమయంలో వచ్చిన విమర్శలను కూడాప్రస్తావించారు. అలాగే ఓటుకు నోటు వివాదానికి సంబంధించిన రెండు కీలక వీడియో క్లిప్పులు కూడా చూపించారు. తనకు ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేవని … తన ప్రయత్నం రాజధాని విషాదం గురించి చెప్పడమేనని నిరూపించారు.
అమరావతి భూసమీకరణ ఎలాంటి ఆందోళనలు లేకుండా సాగింది. అలాంటి ఆందోళనలే జరిగి ఉంటే.. ఇప్పుడు తమ భూమి తమకు ఇప్పించాలంటూ ప్రభుత్వం వద్దకు రైతులు క్యూ కట్టేవారు. రాజధాని అక్కడే ఉండాలని ప్రభుత్వంతో లాఠీ దెబ్బలు తినేవారు కాదు. ఇదే విషయాన్ని పరకాల చెప్పే ప్రయత్నం చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపైనా… నేరుగా చెప్పకుండా.. విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు. అంతిమంగా పరకాల ప్రభాకర్.. తన డాక్యుమెంటరీ ద్వారా.. చర్చ ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నారు., మూడు రాజధానుల పై కూడాచర్చ జరగాలంటున్నారు. అమరావతి అని కాదు కానీ.. రాజధానిని ఎందుకు విషాదంగా మార్చుకుంటున్నారో చర్చించుకోవాలని కోరుకుంటున్నారు. ఆ చర్చలో అయినా కుల, మత, ప్రాంతాలకు అతీతమైన నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నారు.
ఈ డాక్యుమెంటరీలో కొసమెరుపేమిటంటే… ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని సమర్థించి.. ఉపన్యాసాలు ఇచ్చిన కొంత మంది పరకాల డాక్యుమెంటరీలోనూ కనిపించారు. వారి అభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపించింది.