ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పరకాల ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రాబాబుకు లేఖ చేశారు. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్. బీజేపీతో తెలుగుదేశం పార్టీ సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పేందుకు వైఎస్ జగన్.. పరకాల ప్రభాకర్‌ను పదవిలో కొనసాగించడాన్ని ఓ కారణంగా చూపించారు. పాదయాత్రలో పరకాలను టార్గెట్ చేశారు. చంద్రబాబునాయుడు బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని.. అందుకే నిర్మలా సీతారమన్ భర్త అయిన పరకాలను ఇంకా పదవి నుంచి తీసేయలేదని ఆరోపించారు. జగన్ విమర్శలపై పరకాల తీవ్ర మనస్థాపం చెందారు.
తాను ప్రభుత్వంలో ఉండటాన్ని విపక్ష నేత జగన్ తప్పు పడుతున్నారని.. చంద్రబాబుకు రాసిన లేఖలో పరకాల ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం… కేంద్రం పై రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న పోరాటాన్ని తనను కారణంగా చూపి శంకించేలా చేస్తున్నారని.. అందుకే పదవి నుంచి వైదొలుగుతున్నానని లేఖలో… పరకాల పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా చేయడం కలకలం రేపింది. పరకాల రాజీనామాను ఆమోదించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరో ఆరోపణలు చేస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు స్పష్టంగా ప్రకటించాయి.
తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా పరకాల ప్రభాకర్ మీద పూర్తి స్థాయి విశ్వాసాన్ని ప్రకటించాయి. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మలా సీతారామన్ సమర్థించారు. కాన విశాలాంధ్ర మహాసభ పేరిట సమైక్య ఉద్యమాన్ని పరకాల నడపారు. ఇద్దరూ భార్యభర్తలైనా.. స్వతంత్ర భావాలతో ఎవరి ఆలోచనల ప్రకారం వారు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజానికి పరకాల ప్రభాకర్ కూడా కొంత కాలం బీజేపీలో ఉన్నారు. కానీ ఆ తర్వాత బయటకు వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ మీడియా సలహాదారు పదవిని చంద్రబాబు కట్టబెట్టారు. నిర్మలాసీతారమన్ ను ఓ సారి ఏపీ నుంచి రాజ్యసభకు కూడా పంపించారు.
బీజేపీతో టీడీపీ కటిఫ్ చెప్పిన తర్వాత పరకాల ప్రభాకర్‌ను ఎలా కొనసాగిస్తారంటూ… అంతర్గతంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. వాటికి … జగన్ విమర్శలు తోడు అయ్యాయి. పరకాల స్వచ్చందంగా వైదొలగడానికి సిద్ధపడటంతో… ఇప్పుడు నేరుగా ప్రభుత్వం పరకాలకు అండగా నిలబడింది. వైదొలగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో పరకాల విషయంపై స్పష్టత వచ్చినట్లయింది. చంద్రబాబు విదేశీ పర్యటనల సమయంలో పరకాల ప్రభాకర్ చురుగ్గా వ్యవహరించేవారు. విదేశీ మీడియాలో మంచి కవరేజ్ వచ్చేలా ప్రయత్నించేవారు. ఈ కారణంగానే పరకాలపై చంద్రబాబుకు గురి కుదిరినట్లు భావిస్తున్నారు.