జయలలిత, ఎంజిఆర్ చాలా చిత్రాల్లో కలసి నటించారు. నిజానికి ఆమె తొలిరోజుల్లో ఆయనతో కుదుర్చుకున్న అయిదేళ్ల కాంట్రాక్టు ఎంతో ఉపయోగపడింది. లత,మంజుల వంటి వారితో కూడాఎంజిఆర్ ఇలాగే కాంట్రాక్టు చేసుకునేవారు. అంటే ఆ ఆయిదేళ్లు వారు మరెవరి పక్కన నటించకూడదన్నమాట. తర్వాత ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజ్యసభకు పంపించి చాలా ప్రోత్సహించడం తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అపోలో అస్పత్రిలో అత్యంత అనుమానాస్పదంగా మారిన జయలలిత అస్వస్త పర్వం అక్షరాలా ఎంజిఆర్ అనారోగ్యాన్ని గుర్తు చేస్తుంది. ఒక్కసారి ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే-
1984 అక్టోబరులో హఠాత్తుగా ఒక అర్థరాత్రి ఇదే అపోలో ఆస్పత్రి ముందు ఆంబులెన్సు ఆగింది. ముఖ్యమంత్రి ఎంజిఆర్ ఎగశ్వాస దిగశ్వాసతో ప్రాణాంతకంగా ప్రవేశించారు. ఆయన చాలా కాలంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నారని తేలిపోయింది. ఇప్పట్లాగే తీవ్ర ఉత్కంఠ . అత్యంతే జనప్రియుడు గనక అంతులేని ఉద్రిక్తత. . ప్రధాని ఇందిరాగాంధీ కూడా వచ్చి పరామర్శించారు.ు.ఆ నెలాఖరుకు ఆమె దారుణహత్యకు గురై దేశం కల్లోలితమైంది. గవర్నర్ ఎస్.ఎం.ఖురానా సీనియర్ నాయకుడైన నెడుంచెజియన్‌కు ఎంజిఆర్ నిర్వహించే శాఖలు బదలాయించడమే గాక మంత్రివర్గ సమావేశాలకు అద్యక్షత వహించే అధికారం అప్పగించారు. ఆయన తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష డిఎంకె నేత కరుణానిధి విమర్శించారు. కేంద్రం అనుకూలంగా వుంది గనక ఇబ్బంది లేకపోయింది. ఎంజిఆర్‌ను అమెరికాలోని బ్రూక్లీకి తీసుకెళ్లారు. ఆయన పేరిట ో అనేక నిర్ణయాలు అమలు జరిగాయి.పార్లమెంటరీ పార్టీ నేతగా జయలలిత తొలగింపు, మంత్రి తిరువక్కరుసు శాఖల తగ్గింపు వగైరా. నెడుంచెజియన్, ప్రధాన కార్యదర్శి వీరప్పన్, మరో మంత్రి పియుషణ్ముగం, ఎంజిఆర్ మొదటి భార్య జానకి దుష్టచతుష్టయంగా ఆయన పేరిట పెత్తనం చేస్తున్నారనే అందరూ భావించారు. ఈలోగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నాడిఎంకె పొత్తు పెట్టుకోవడం, ఇందిర హత్య ఎంజిఆర్ అనారోగ్యం రెండూ సానుభూతులతో అఖండ విజయం సాధించడం జరిగిపోయాయి. ఎంజిఆర్ నామినేషన్‌పై అక్కడే సంతకం చేశారని చెప్పారు. ఎనిమిది నెలల తర్వాత ఆయన ప్రాణాలతో తిరిగి రావడం ప్రజలను ఆనందడోలికల్లో ముంచేసింది. కాని మాట లేదు, కదలికలు చాలా నామమాత్రం. అంతా ఆయన పేరిట సాగిన కొద్దిమంది ముఠా పాలన.చివరకు ఆయన 1987లో మరణించాక జయలలితను అంతిమశకటనం నుంచి దించేయడం,జానకిని ముఖ్యమంత్రిని చేయడం, తర్వాత తగాదాలు, చివరకు అసెంబ్లీ రద్దు దేశ రాజకీయాలల్లో ఒక జుగుప్సాకర ఘట్టంగా మిగిలిపోయాయి.
ఎంజిఆర్ మరణించాకే కరుణానిధి 1988 ఎన్నికల్లో గెలిచారు కాని ఆయనకూ భార్యలు పిల్లల వివాదాలు తప్పలేదు. 1991లో రాజీవ్‌గాంధీ కూడా అక్కడే హత్యకు గురికావడంతో కాంగ్రెస్ అన్నా డిఎంకెలు విజయం సాధించాయి. అప్పటి నుంచి ఈయన జయలలిత ఒకరితర్వాత ఒకరు పాలిస్తూ వచ్చారు. కేంద్రంలోనూ పొత్తులు అటూ ఇటూ మార్చేవారు. ఈ క్రమంలో జయను శశికళ వంటి స్నేహితులు అవినీతి ఆరోపణలూ ఆర్భాటాలు వెంటాడాయి.ఇక కరుణ ఇంట కుమారులు స్టాలిన్ అళగిరి తగాదాలు. మరోవైపు మారన్లగొడవ. తర్వాత కనిమొళి అరెస్టు వంటివి తమిళనాడు ప్రతిష్టకు మంచ్చ తెచ్చాయి.ఇవన్నీకూడా వాస్తవంలో కుటుంబాలు వ్యక్తుల కుటిల రాజకీయాల ఫలితాలే. ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చేస్తూ అన్నిరకాల అప్రతిష్టాకర వ్యవహారాలూ అనుమతించారు. చివరకు జయలలిత శిక్షకు కూడా గురై జైలుకు వెళ్లి బయిటపడ్డారు. వీటన్నిటి చాటునా తన అనారోగ్యాన్ని కప్పిపుచ్చుకుంటూ తనకు తనే హాని చేసుకున్నారు. 2015లోనే ఆమె చాలా రోజులు కనిపించకుండా పోయినప్పుడు అనేక కథనాలు వచ్చాయి..చెన్నై జలప్రళయం సమయంలోనూ కనిపించలేదంటే కదల్లేని అనారోగ్యమే కారణం. . ఎంజిఆర్ ఎప్పుడూ ఒకే మేకప్‌తో తన అసలు రూపాన్ని ఎంతగా దాచుకునేవవారో ఆయనకు అతి దగ్గరవాడైన డిజిపి ఒకరు సవివరంగా రాశారు. ఆధునిక మీడియాలో అది సాధ్యం కాదు గనకే జయలలిత సాధ్యమైనంత తక్కువగా బయిటకు కనిపిస్తూ క్లుప్తమైన లిఖిత పూర్వక ఆదేశాలతో పాలన నడిపిస్తూ వచ్చారు. చివరకు ఇప్పుడు ప్రాణాంతకస్థితిలో పడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సానుకూలంగా వుంది గనక పూర్తి సమాచారం లేకున్నా కాలం గడవనిస్తున్నారు. ఆమె గురించి వస్తున్న వదంతులలో ఏది ఎంత నిజం అనేది ఎలా వున్నా పాలనకు సబంధించిన మధ్యంతర ఏర్పాట్లు అనివార్యమే