హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుడు విధానాలవల్లే విజయవాడలో కాల్‌మనీ లాంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థసారథి అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు ఆ హామీని నెరవేర్చలేదని, దానితో బ్యాంకులు మహిళలకు రుణాలివ్వకపోవటంవల్లే వారు గత్యంతరం లేక కాల్‌మనీ వంటి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఉన్న తమ పార్టీ నేతల పేర్లను బయటపెట్టాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. నిందితుడితో విదేశాలకు టూర్ వెళ్ళిన తెలుగుదేశం నాయకుడు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జోలికి పోలీసులు వెళ్ళటంలేదని, ఆయన సాక్షాత్తూ కలెక్టర్ల సమావేశంలోనే తమ పార్టీవారి జోలికి వెళ్ళొద్దని హుకుం జారీచేశారని పార్థసారథి చెప్పారు. ఈ కేసులో నిందితులను తప్పించటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశాన్ని తమ పార్టీ అసెంబ్లీలో నిలదీస్తుందని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మహిళలు, గిరిజనులపై ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు.