వైఎస్‌కు సన్నిహితుడు. బీసీ నేత. సీనియర్ రాజకీయ వేత్త. కృష్ణా జిల్లాలో టీడీపీకి వ్యతిరేకంగా నిలబడిన నేత. ఇన్ని క్వాలిటీస్… పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారధి మంత్రి పదవికి అర్హతకు కొలమానంగా నిలబడటం లేదు. వైసీపీ గెలిచినప్పుడు కృష్ణా జిల్లాలో మంత్రి పదవికి మొదటగా వినిపించిన పేరు పార్థసారధిదే. కానీ అనూహ్యంగా ఆయన వెనుకబడిపోయారు. ఇద్దరు నానిలు పదవుల్ని ఎగరేసుకుపోయారు. ఒకరు కొడాలి నాని.. మరొకరు పేర్ని నాని. అందుకే మొదట్లో పార్థసారధి అసంతృప్తికి గురయ్యారు. అప్పట్లో వైసీపీ హైకమాండ్ బుజ్జగించింది. తర్వాత విడతలో చాన్సిస్తామని హామీ ఇచ్చింది.
రెండున్నరేళ్ల తర్వాత తొంభై శాతం మందిని తీసేసి కొత్త వారికి చాన్సిస్తామని వైఎస్ జగన్ నేరుగానే చెప్పారు. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతుంది. ఈ సారైనా చాన్స్ వస్తుందో లేదోనని పార్థసారధి టెన్షన్ పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. కృష్ణా జిల్లా కోటాలో మంత్రులుగా ఉన్న ఇద్దరు నానీలు తమ పదవుల్ని కాపాడుకునేందుకు … హై లెవల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను మెప్పించేలా టీడీపీ, జనసేనలపై బాధ్యత తీసుకుని విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై ఎవరూ చూపించనంత విధేయత చూపిస్తున్నారు. దీంతో పార్థసారధికి కొత్త భయం ప్రారంభమయింది. తాను వెనుకబడుతున్నానన్న ఫీలింగ్‌కు వచ్చారు.
ఇప్పుడు పార్థసారధి తన స్వభావానికి విరుద్ధంగా .. జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోరంకిలో జరిగిన వాలంటీర్ల సత్కార సభ నుంచే ఆ టాస్క్ ప్రారంభించారు. ఆ సభలో మాట్లాడిన పార్థసారధి… సీఎం జగన్ … ప్రధాని అవుతారని పొగిడేశారు. ఆయన పథకాలు అలాంటివని ప్రశంసలు గుప్పించారు. అంతకు ముందు ఆయన ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల్లో… ఆలయం మీద జగన్ బొమ్మ వేసి..,భక్తులు నమస్కరిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. ఆ ఫ్లెక్సీలను చూసి… పాపం.. పార్థసారధి అని వైసీపీ నేతలే గొణుక్కుంటున్నారు. విధేయతా ప్రదర్శనలో వెనుకబడకుండా ఇప్పుడు పార్థసారధి రేసులోకి వచ్చారు. కొడాలి, పేర్నీ నానిలను దాటేంత పర్ఫార్మెన్స్ చూపిస్తేనే ఆయనకు బెర్త్ ఖరారవుతుంది. లేకపోతే ఆయన ఆశ నిరాశ కావొచ్చు.