ఏపీ వ్యాప్తంగా స్కూళ్లలో నిర్వహించిన పేరంట్,టీచర్ మీటింగ్ ఉత్సాహంగా సాగింది. అన్ని చోట్లా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు స్థానికప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అక్కడిక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూళ్ల సమస్యలపైనా చర్చించారు. వాటిని పరిష్కరించేందుకు మార్గాలను కూడా చర్చించుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే ఇప్పటి వరకూ విద్యార్థులు సమయానికి వస్తారు వెళ్తారు అన్నట్లుగా ఉంటుంది.అయితే విద్యార్థుల్ని వ్యక్తిగతంగా కూడా ఎసెస్ చేస్తామని వారి తల్లిదండ్రులకు ఈ పీటీఎం ద్వారా భరోసా ఇచ్చారు.
ప్రైవేటు స్కూళ్లలో పీటీఎంసు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహిస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం అరుదు. రాజకీయ కార్యక్రమానికి కాకుండా పూర్తిగా విద్యార్థుల భవిష్యత్ కోసం స్కూళ్ల మెరుగు కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం అందర్నీ ఆకట్టుకుంది. చంద్రబాబు, లోకేష్ బాపట్లలోని ఒకే స్కూల్లో పీటీఎంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కొంత మంది పిల్లలతో స్వయంగా మాట్లాడారు. కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అక్కడ స్కూల్ కు కావాల్సిన కిచెన్ సదుపాయాల్ని వ్యక్తిగత సొమ్ముతో నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పీటీఎంపై టీచర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తాము భావి భవిష్యత్ ను తీర్చిదిద్దుతున్నామన్న స్ఫూర్తి మెరుగుపడుతుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూల్స్ కంటే మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. స్కూల్స్ మెరుగు అంటే రంగులు వేయడం, బల్లలు కొనడం కాదని.. విద్యార్థులకు చదువు చెప్పే ప్రమాణాలు పెంచడం అని ఈ ప్రభుత్వం నిరూపిస్తోంది.