Pareshan movie review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
కంటెంట్ నచ్చితే సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ముందుకు వస్తుంటారు రానా. కేరాఫ్ కంచరపాలెం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళిన క్రెడిట్ రానాకి దక్కుతుంది. ఆయన సమర్పకుడిగా వుంటే చిన్న సినిమా కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ‘పరేషాన్’ సినిమాకి సమర్పకుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రానా. మంచి నటుడని పేరు తెచ్చుకున్న తీరువీర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం మరో విశేషం. ప్రచార చిత్రాలు చూస్తే తెలంగాణ నేపధ్యంలోని ఓ పల్లెటూరి కథని అర్ధమైయింది. జాతిరత్నలు తర్వాత ఇలాంటి కథలు ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి. నలుగురు స్నేహితులు, వాళ్ళ అమాయకత్వం, అందులో నుంచి పుట్టిన హాస్యం మెప్పిస్తే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సినిమాని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. మరి పరేషాన్ ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేసిందా ? ఈ పల్లె కథ ఎలాంటి వినోదాల్ని పంచింది ?
తెలంగాణలోని మంచిర్యాల. సమర్పణ్ (మురళీధర్ గౌడ్ ) సింగరేణి కార్మికుడు. తన ఉద్యోగం కొడుకు ఐజాక్ ( తురువీర్ )కి ఇచ్చి మిగిలిన జీవితం సువార్త చెబుతూ గడపాలని భావిస్తాడు. తన ఉద్యోగం ఐజాక్ కి ఉద్యోగం బదిలీ చేయడానికి కావాల్సిన డబ్బు భార్య గాజులు అమ్మి మరీ సమకూరుస్తాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఐజాక్ ఆ డబ్బుని తండ్రికి తెలియకుండా తన స్నేహితులకు ఇచ్చేస్తాడు. ఇచ్చిన డబ్బుని తిరిగడిగితే .. రేపుమాపు అని చెబుతుంటారు స్నేహితులు. అదాలావుంటే శిరీష (పావని కరణం)ని ఓ పెళ్లి బరాత్ లో చూసి ఇష్టపడతారు ఐజాక్. పావని కూడా ఐజాక్ ని ఇష్టపడుతుంది. ఇద్దరూ శారీరకంగా దగ్గరౌతారు. తాను నెల తప్పానని చెబుతుంది శిరీష. దీంతో ఇంకొ పరేషాన్ ఐజాక్ ని చుట్టుకుంటుంది. శిరీషని హైదరాబాద్ హాస్పిటల్ లో చూపించాలని అనుకుంటాడు ఐజాక్. డబ్బు సమకూర్చి ఆమెను తీసుకెళదామనే లోపు ఆ డబ్బుని కూడా ఎవరో మాయం చేస్తారు. దీంతో లొల్లి మళ్ళీ మొదటికి వస్తుంది. అసలు ఈ పరేషాన్ నుంచి ఐజాక్ బయటపడ్డాడా ? స్నేహితులు డబ్బు తిరిగిచ్చారా ? డబ్బు లేదనే సంగతి ఐజాక్ తండ్రికి తెలిసిందా? శిరీషతో ప్రేమ ఏమైయింది ? అనేది ఇగిలిన కథ.
ఓ నలుగురు తెలంగాణ పోరగాళ్ళ కథ ఇది. కథ అనడం కంటే కొన్ని సంఘటనలు అనడం సబబు. ఒక సినిమా లేదా కథ ఫలానా రూపంలో వుండాలనే నిబంధన ఏమీ లేదని కొందరు అభిప్రాయపడుతుంటారు. అలాంటి అభిప్రాయం నుంచి పుట్టుకొచ్చిన సినిమా ఇది. రెగ్యులర్ సినిమా ఫార్మెట్ కి ఉండాల్సిన చాలా లక్షణాలు ఇందులో కనిపించవు. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలి, వాళ్ళని నవ్విస్తే చాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ కొన్ని చోట్ల తను అనుకున్న ఫన్ పడించగలిగాడు. కానీ ఓవరాల్ చూసినప్పుడు మరీ ఇంత తేలిగ్గా, నవ్వులాటగా తీసారేంటీ ? అనిపిస్తుంది.
నిజానికి ఇందులో చెప్పుకొదగ్గ కథ కూడా లేదు. సినిమా ఆరంభంలో ఐజాక్ డబ్బుని స్నేహితుల అవసరానికి వాడేస్తాడు. పాపం.. అంత డబ్బుని తిరిగిచ్చే స్తోమత ఆ స్నేహితులకు వుండదు. అందరూ అల్లరి చిల్లరరా తిరగే బ్యాచే. చివరివరకూ ఈ లైన్ ని పట్టుకొని నడపడం అంత ఈజీ కాదు. కానీ దర్శకుడు ఆ పాత్రల నుంచే కావాల్సిన వినోదాన్ని రాబట్టలని ప్రయత్నించాడు.
ఆరంభంలో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ సరదాగా వుంటుంది. బేసిగ్గా నవ్వకూడదు గానీ సమర్పణ్ ఇంగ్లీష్ అనువాదంలో చెప్పే సువార్త వచ్చిన ప్రతిసారి థియేటర్ లో నవ్వులు పండాయి. అలాగే వెలుగు వెలుగు పాట షూటింగ్ , మంజుల పాట హిలేరియస్ గా వచ్చాయి. ఐజాక్, శిరీష ప్రేమాయణం కూడా వినోదం వుంటుంది. దిని తోడు స్నేహితుల్లో ఒకడైన సత్తి, లోకల్ టీవీ యాంకర్ తో నడిపే ప్రేమలో కూడా ఫన్ వుంటుంది.
సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫన్ డ్రాప్ అయ్యింది. దీనికి కారణం ఇందులో కథ లేకపోవడం. ఎంత కుర్రాళ్ళ తో సినిమా చేసినా పాత్రలు నడపడటానికి వాటితో ప్రయాణించడానికి కథ కావాలి. కథ నుంచి పుట్టిన హాస్యమే గుర్తుంటుంది. నిజానికి ఐజాక్, శిరీష్ ప్రేమని ఇంకా బలంగా తీర్చిదిద్దవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో దాని జోలికే వెళ్ళలేదు దర్శకుడు. ఆ ప్రేమకథని అంత లైట్ తీసుకున్నప్పుడు.. హిందూ, క్రిస్టియన్ నేపధ్యం ఎత్తుకోవడం, దాన్ని ప్రచారం చేసుకోవడం అవసరం లేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చాలా రిపీటెడ్ సీన్లు కనిపిస్తాయి. ఈ సినిమాలో ఎక్కువ ఖర్చు బీర్ బాటిల్స్ కే అయ్యింటుంది. అన్ని తాగుడు సీన్లు వున్నాయి. సత్తి వేలు పోయిన సన్నివేశం మాత్రం హిలేరియస్ గా వుంటుంది. సెకండ్ హాఫ్ లో అలాంటి మరికొన్ని సీన్లు ఉండేలా చూసుకోవాల్సింది.
తీరువీర్ మంచి నటుడు. బరువైన పాత్రలు పోషించగలడు. ఇందులో ఐజాక్ పాత్రలో సహజంగా ఇమిడిపోయాడు. తన చూపు, మాటలో అమాయకత్వం పండింది. తిరువీర్ తప్పితే ఫ్రండ్స్ బ్యాచ్ లో అందరూ కొత్తవాళ్ళే. సత్తి పాత్రలో చేసిన నటుడి నటన మెప్పిస్తుంది. అలాగే మైదాక్ పాత్రలో కూడా ఫన్ వుంది. పావని కరణం అమాయకత్వం ఆకట్టుకుంటుంది. మురళిధర్ కు అలవాటైన పాత్రే. టైగర్ శ్రీనన్న, పాషా.. ఇలా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా నేపధ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. సింపుల్ సీన్స్ ని కూడా ఆర్ఆర్ ఎలివేట్ చేసింది. పాటలు డిఫరెంట్ గా ప్రయత్నించారు. కెమరాపని తనం బావుంది. తెలంగాణ పల్లెని పచ్చగా కూల్ గా చూపించారు. నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. మాటల్లో తెలంగాణ యాస ఉట్టిపడుతుంది.
ప్రతి కథకు ఒక ఆరంభం, మలుపు, ముగింపు వుంటాయి. కామెడీ సినిమా అయినా సరే అవి ప్రభావవంతంగా వుండాలి. పరేషాన్ ని కేవలం నవ్వించడానికే రాసుకున్నాడు దర్శకుడు. ఈ కథ ఆరంభం, మలుపు, ముగింపు గుర్తుపెట్టుకునేలా వుండవు కానీ… కొన్ని చోట్ల మాత్రం నవ్విస్తాయి.
తెలుగు360 రేటింగ్ : 2.25/5