రేటింగ్: 2/5
పాత అలవాట్లు కొత్తగా ఫ్యాషన్ అవుతున్నాయి. కుండల్లో వండుకుంటున్నాం. రాగి వస్తువులు మళ్లీ వాడుతున్నాం. పాత తరం ముచ్చట్లు చెప్పుకుంటూ… ఆ తరం అలవాట్లు, రుచులు, నమ్మకాలు మళ్లీ ఆచరిస్తున్నాం. అలాగని… ప్రతీసారీ ‘పాత పచ్చడి’ రుచించకపోవొచ్చు. సినిమా కథల్లో అయితే పాత ముమ్మాటికీ రోతే! కానీ ఈ విషయం పట్టించుకోకుండా 1980ల నాటి కథల్ని, కథనాల్ని, పాత్రల స్వభావాల్నీ మళ్లీ మనకు ‘పరిచయం’ చేసింది ఈ ‘పరిచయం’.
* కథ
సాంబ (ఫృథ్వీ), సుబ్బు (రాజీవ్ కనకాల) ఇద్దరూ మిత్రులు. రైల్వే లో పని చేస్తుంటారు. క్వార్టర్స్‌లో పక్క పక్క ఇళ్లే. సుబ్బు కొడుకు ఆనంద్ (విరాట్). సాంబ కూతురు లక్ష్మి (సిమ్రాన్ కౌర్). ఇద్దరూ ఒకేరోజు ఒకే ఆసుపత్రిలో పుడతారు. అప్పటి నుంచీ స్నేహితులుగా ఎదుగుతారు. వయసొచ్చాక ప్రేమలో పడతారు. కానీ సాంబకు ఈ ప్రేమలపై ఎలాంటి నమ్మకాలూ ఉండవు. అందుకే.. వీళ్ల ప్రేమకు అడ్డు చెబుతాడు. ఆ కోపంతో లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. ప్రాణాలతో బతికి బయటపడినా, గతం మర్చిపోతుంది. చివరికి ఆనంద్‌తో సహా! మరి లక్ష్మికి గతం గుర్తొచ్చిందా? ఆనంద్, లక్ష్మి మళ్లీ కలిశారా? లేదా? అనేదే `పరిచయం` కథ.
* విశ్లేషణ
పిల్లలు ప్రేమించుకుంటే, పెద్దలు అడ్డు చెప్పడం – వాళ్లిద్దరూ ఎక్కడికో వెళ్లి బతకడం. ఇది అరిగిపోయిన ఫార్ములా. అయితే దానికి హీరోయిన్ గతం మర్చిపోవడం అనే – ఇప్పటి ట్రెండ్ సూత్రాన్ని జోడించాడు. అలాగైనా పాత, కొత్త మేళవింపు సాగిందనుకోవడానికి వీల్లేదు. గతం మర్చిపోవడం అంటే.. మొన్నొచ్చిన `తేజ్` సినిమాలో అనుపమ పరమేశ్వరన్లా కాదు. `వసంత కోకిల`లో శ్రీదేవిలా. అలా… ట్రెండింగ్ ఫార్ములాని కూడా పాత సినిమా ఛాయల్లో తీసేసరికి `పరిచయం` అడుగడుగునా పాత సినిమాలనే మళ్లీ మనకు పరిచయం చేస్తుంటుంది. ఈ కథని ప్రారంభించిన విధానం బాగుంది. అయితే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లే సరికి కథ తేలిపోయింది. తూనీగ తూనీగ లాంటి స్నేహం, కాలేజీ సన్నివేశాలు, మనసులోని మాట బయటకు చెప్పుకోలేకపోవడాలూ… ఈ సన్నివేశాలన్నీ నిదానంగా సాగాయి. మధ్యలో ‘హెల్మెట్’ కామెడీ అయితే… కితకితలు పెట్టుకున్నా నవ్వు రాదు. ఫృథ్వీ, రాజీవ్ కనకాల ఇద్దర్నీ స్నేహితులుగా చూపించి, సడన్‌గా శత్రువులుగా మార్చేశాడు దర్శకుడు. వాళ్ల భార్యల పాత్రలకు ఎంచుకున్న నటీమణులు, వాళ్ల గళాలు మరింత ఇబ్బంది పెట్టే వ్యవహారాలు. ఆఖరికి ఫృథ్వీ డబ్బింగ్ కూడా సూట్ కాలేదు. దర్శకుడు చాలా వరకూ లాజిక్కులు పట్టించుకోలేదు. ఓ సన్నివేశంలో కథానాయకుడు అరకు నుంచి కాకినాడ వచ్చేట్టు చూపించారు. అరకులో క్లీన్ షేవ్‌తో కనిపించిన హీరో, కాకినాడలో దిగేసరికి నిండు గడ్డం గెటప్పులో మారిపోయాడు. కనీసం కంటిన్యుటిలను కూడా పట్టించుకోకపోతే ఎలా? పురుగుల మందు తాగితే గతం మర్చిపోయిందనుకుంటే ఓకే అనుకోవొచ్చు. మరి తలకు కట్టుకట్టడమేంటి? విదేశీ డాక్టర్లు కూడా నయం చేయలేని పిచ్చి…. రెండు కరెంటు వైర్లు ముట్టుకోగానే ఎగిరిపోవడమేంటి? సముద్రంలో గ్యాస్ నిక్షేపాల గురించి ఓ ముఠా ట్రై చేస్తున్నట్టు చూపించే సన్నివేశం… ఈ సినిమాలో, ఈ కథలో ఎందుకు?? అనవసరం అనిపించేవి, ట్రిమ్ చేయదగినవీ బోలెడన్ని సీన్లు కనిపిస్తాయి.
* నటీనటులు
ఇలాంటి కథలు, పేలవమైన సన్నివేశాల కోసం పేరున్న నటీనటులని వాడుకున్నా పెద్దగా ఒరిగేదేం ఉండదు. అయితే ఉన్నంతలో విరాట్, సిమ్రన్‌లు బాగానే చేశారు. విరాట్‌లో ఈజ్ ఉంది. దాన్ని దర్శకుడు సరిగా వాడుకోలేదు. కొన్ని కొన్ని చోట సిమ్రన్ చాలా అందంగా కనిపించింది. ఫృథ్వీ అవసరానికి మించి నటించాడు. రాజీవ్ కనకాల ఓకే అనిపిస్తాడు. సిజ్జుకి ఇది కొత్త తరహా పాత్ర. గంభీరంగా కనిపించాడు.
* సాంకేతిక వర్గం
హైదరాబాద్ నవాబ్స్, నిన్నా నేను రేపు లాంటి వైవిధ్యభరితమైన సినిమాల్ని తీసిన లక్ష్మీకాంత్ చెన్నా మరీ ఇంత రొటీన్ కథని ఎంచుకుంటాడని ఎవ్వరూ ఊహించరు. పోనీ.. దాన్నైనా వైవిధ్యంగా మలిచాడా అంటే అదీ లేదు. దర్శకుడిగానే కాదు, కథకుడిగానూ విఫలమయ్యాడు. మాటల్లో కవిత్వం ఎక్కువయ్యింది. పాటలు, కెమెరా వర్క్ బాగున్నాయి.
* తీర్పు
స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ అంటూ ఎన్ని క్యాప్షన్లు ఇచ్చినా ఇలాంటి ప్రేమ కథలకు కాలం చెల్లిపోయింది. ప్రేమలో స్వచ్ఛతని కొలవడానికి ఈ తరహా కథలొక్కటే కొలమానం కాదు. నేటి తరం వైవిధ్యాన్ని కోరుకుంటోంది. దాన్ని అందిచిన చిత్రాలే రేసులో నిలుస్తాయి. లేదంటే.. పరాజయాల్ని మళ్లీ పళ్లీ ఇలానే `పరిచయం` చేసుకోవాల్సివస్తుంది.
* ఫినిషింగ్ టచ్: ‘పరిచయం’…పాతవే నయం
రేటింగ్: 2/5