Parijatha Parvam movie review
తెలుగు360 రేటింగ్: 1.5/5
‘కిడ్నాప్ చేయడం ఓ కళ’… అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం ‘పారిజాత పర్వం’. దాన్ని బట్టి ఇదో కిడ్నాప్ కథ అని ముందే అర్థం చేసుకోవొచ్చు. క్రైమ్ జోనర్లో చాలా సేఫెస్ట్ డ్రామా ఇది. అపహరణ చుట్టూ నడిచిన కథల్లో ఉత్కంఠత, వినోదం రెండింటినీ మెళవించొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. మరి ఇదే పాయింట్ పట్టుకొన్న ‘పారిజాత పర్వం’ ఎలా వుంది? సక్సెస్ ఫార్ములా ఈ చిన్న సినిమా విషయంలో వర్కవుట్ అయ్యిందా?
చైతన్య (చైతన్యరావు) దర్శకుడవ్వాలని కలలు కంటుంటాడు. ఓ కథ రాసుకొని తన స్నేహితుడు (హర్ష)ని హీరోని హీరో చేయాలని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు. కొంతమంది ‘ఛీ’ కొడతారు. ఇంకొంతమందికి కథ నచ్చినా హీరో నచ్చడు. దాంతో… చైతన్య ప్రయత్నాలు ఫలించవు. చివరికి తానే నిర్మాతగా మారి, సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు సంపాదించడం కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలనుకొంటారు. మరోవైపు ఇదే కిడ్నాప్ ప్లాన్‌ని బారు శ్రీను (సునీల్) కూడా వేస్తాడు. పారు (శ్రద్దా దాస్)తో కలిసి శెట్టి రెండో భార్యని అపహరించి, డబ్బు సంపాదించాలని స్కెచ్ వేస్తాడు. అటు చైతన్య, ఇటు బారు శ్రీను.. ఇద్దరి టార్గెట్ ఒకటే. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? తన కథేంటి? చైతన్య సినిమా తీశాడా, లేదా? ఇదంతా వెండి తెరపై చూడాలి.
ఒకరినే కిడ్నాప్ చేయడానికి రెండు టీమ్‌లు ప్లాన్ చేయడం, అందులోంచి పుట్టిన కన్ఫ్యూజన్, ఫన్.. ఇదీ ‘పారిజాత పర్వం’ ముడి సరుకు. పాయింట్ వరకూ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అయితే ఇలాంటి పాయింట్స్ డీల్ చేయాలంటే నైపుణ్యం అవసరం. సినిమాని ఫాస్ట్ ఫేజ్ లో ఓపెన్ చేయాలి. తెరపై కనిపిస్తోంది స్టార్లు కాదు, కొత్తవాళ్లే అనే ఆలోచనను ప్రేక్షకుల నుంచి దూరం చేయాలి. ఫన్, సస్పెన్స్, థ్రిల్.. ఇలా ఏదో ఒకటి ఇచ్చుకొంటూ వెళ్లాలి. అయితే దర్శకుడు మాత్రం ఇవేం చేయలేదు. ఈ కథని చాలా నిదానంగా చెప్పడం మొదలెట్టాడు. చైతన్య సినిమా కష్టాలు ఓపెన్ చేస్తూ ‘పారిజాతపర్వం’లోని పేజీలు తిప్పుకొంటూ వెళ్లాడు. ఇలాంటి సెటప్.. ఈమధ్య వచ్చిన ‘భరతనాట్యం’ అనే సినిమాలోనూ కనిపిస్తోంది. అందులోనూ అంతే. హీరో.. డైరెక్టర్ కావాలనుకొంటాడు. తన కథని అందరూ తిరస్కరిస్తుంటే, తానే సినిమా చేయాలని అనుకొంటాడు. డబ్బుల కోసం క్రైమ్ చేస్తాడు. అక్కడ బ్యాగులు మారిపోవడం వల్ల రిస్క్ మొదలవుతుంది. ఇక్కడ కిడ్నాప్ చేయాల్సిన మనుషులే మారిపోతారు. అంతే తేడా. దాదాపు ఒకేసారి, దాదాపు ఒకే కథతో రెండు సినిమాలొచ్చాయి. ‘భరతనాట్యం’ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు ‘పారిజాత పర్వం’ జాతకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకొంటా.
సినిమా ప్రారంభమైన తొలి 20 నిమిషాల్లోనే రెండు గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలిగించిన సినిమా ఇది. కథ ముందుకు సాగదు. చెప్పిందే చెప్పడం, చూపించిన సీనే మళ్లీ రిపీట్ చేయడం ఇదే తంతు. డబ్బుల కోసం కిడ్నాప్ చేయాల్సిందే అని ఫిక్సయిన తరవాత కథ ఊపందుకోవాలి. అదీ సాగలేదు. ‘కిడ్నాప్ చేయడం ఓ కళ’ అన్నారని, కిడ్నాప్ స్కెచ్ చాలా ఇన్నోవేటివ్‌గా వేశారని అనుకొంటే పొరపాటే. ఆ ప్లాన్ కూడా చాలా రొటీన్‌గా, లాజిక్ లెస్‌గా ఉంటుంది. హీరోయిన్ తన సగం, సగం పరిజ్ఞానంతో కారు నడిపే సీన్ ఒక్కటే నవ్వులు పంచుతుంది. మధ్యలో వైవా హర్ష ఫస్ట్రేషన్, హీరో అనే బిల్డప్ కాస్త రిలీఫ్ ఇస్తుంది. మిగిలిన చాదస్తం భరించడం చాలా కష్టం. సెకండాఫ్‌లో కన్ఫ్యూజన్ డ్రామా ఉంది. దాన్ని సరిగా డీల్ చేసి ఉంటే బాగుండేది. అక్కడ కూడా లాజిక్కులు వదిలేసి, కాలక్షపం సన్నివేశాలతో నింపేసి, ఈ కాస్త కథనీ మరింత కంగాళీ చేసేశాడు దర్శకుడు. ఓ సీన్లో వైవాహర్ష ‘అసలు ఈ కథెక్కడ దొరికిందిరా నీకు’ అని అరిచి గోల పెడతాడు. థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి కూడా అంతే. ఇలాంటి కథలకు చివర్లో ఓ సర్ప్రైజింగ్ ట్విస్టంటూ వస్తుంది. దాని కోసం ప్రేక్షకుడు ఎదురు చూస్తుంటాడు కూడా. ఈ సినిమాలోనూ అలాంటి ట్విస్ట్ ఉంది. అయితే అది ఇప్పటికే చాలాసార్లు చూసి ఉండడం వల్ల అది ట్విస్ట్ అనిపించుకోదు.
ఓ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యాడు చైతన్య రావు. దాన్ని చూసే సినిమా అవకాశాలూ వచ్చాయి. అయితే… ఆ పాపులారిటీని సరిగా వాడుకోలేకపోతున్నాడు. ఇలాంటి పేలవమైన కథల్లో దొరికిపోతున్నాడు. చైతన్య రావులోని ఏ కొత్త కోణమూ ఈ సినిమా చూపించలేకపోయింది. సునీల్ అటు విలన్‌కీ, ఇటు కామెడియన్కీ కాని పాత్రలో నలిగిపోయాడు. శ్రద్దాదాస్ పాత్ర కూడా అంతంత మాత్రమే. తొలిసగంలో ఈ పాత్రని అస్సలు వాడుకోలేదు. కథానాయిక గురించి ఎంత చెప్పుకొంటే అంత తక్కువ. శ్రీకాంత్ అయ్యంగార్ కి మరో రొటీన్ పాత్ర పడింది. ఉన్నంతలో వైవా హర్ష కాస్త బెటర్. తను లేకపోతే మరింత బోర్ ఫీలయ్యేవాళ్లే.
కిడ్నాప్ చేయడం ఓ ఆర్ట్. అయితే అలాంటి సినిమాల్ని ఆసక్తిగా చెప్పడం కూడా ఆర్టే. ఇందులో కొత్త దర్శకుడు దొరికిపోయాడు. చాలా సాదా సీదా కథని, పేలవమైన స్క్రీన్ ప్లే, రొటీన్ ట్విస్టులతో సాగదీశాడు. నిరుత్సాహ పరిచాడు. కనీసం ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటన కూడా రాబట్టుకోలేకపోయాడు. ఇదంతా దర్శకుడి వైఫల్యమే. సంగీత దర్శకుడి పేరు ‘రీ’ అట. ఆ పేరుకి సార్థకత తీసుకురావడానికి ‘రీ’ రికార్డింగుతో ఊదరగొట్టేశాడు. ‘రీ’పీట్ ట్రాకులతో విసిగించాడు. చిన్న సినిమా కాబట్టి బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. లాజిక్కులు చాలా మిస్సయిపోయాయి. మొత్తానికి సినిమా తీయడం కూడా ఓ కళే అని మర్చిపోయి తీసిన సినిమాలా.. ‘పారిజాతపర్వం’ మిగిలిపోయింది. ఇంత సినిమా తీసి, పొరపాటున హిట్టయిపోతే.. అనే బెంగతో సీక్వెల్ కార్డు కూడా వేసి పారేశారు, ఎందుకైనా పనికొస్తుందని. ఈ ఫలితం చూశాక ఆ ప్రమాదం ఉండదని హామీ ఇస్తున్నాం.
ఫినిషింగ్ టచ్: సర్వం శిరోభారం
తెలుగు360 రేటింగ్: 1.5/5