తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా.. ఇటీవలి కాలంలో కొంత మంది స్వామిజీలు పాపులర్ అయిపోయారు. గతంలో చినజీయర్ లాంటి ఒకరిద్దరు మాత్రమే… ప్రజలకు తెలుసు. వారు కూడా.. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే పాల్గొనేవారు. రాజకీయాలు మాట్లాడటం పరమపాపం అన్నట్లు ఉండేవారు. కానీ ఈ పరిస్థితి గత నాలుగేళ్లలో పూర్తిగా మారిపోయింది. కొంత మంది స్వాములు ఇప్పుడు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. రాజకీయ తరహా ఉద్యమాలు మాత్రమే చేస్తున్నారు. వాళ్లందరికి పీఠాలు కూడా ఉన్నాయి.
విశాఖ శారదాపీఠం పేరుతో.. స్వరూపానందేంద్ర స్వామి చేసే రాజకీయ ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు ఓ రకంగా ఆస్థాన స్వామిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేస్తూంటారు. ఇక కొద్ది రోజుల కిందట… టీటీడీకి… సుధాకర్ యాదవ్‌ను చైర్మన్‌గా నియమించగానే ఏదో పీఠం పేరు పెట్టుకుని శివస్వామి అనే స్వామి తెరపైకి వచ్చారు. ఈయన ఇంకా వివాదాస్పద స్వామి. భద్రాచలం రాములవారి గర్భగుడిలోనే ధర్నా చేశారు. దానికి కూడా.. ఆధ్యాత్మిక కారణాలే చెప్పారు. ఇక శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఇటీవలి కాలంలో హిందూ బేస్‌గా రాజకీయాలు ప్రారంభించారు. ప్రత్యేకంగా చానల్ పెట్టి హిందూత్వ పరిరక్షణ అంటూ ఉద్యమాలు ప్రారంభించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన వదిలి పెట్టడం లేదు. రాజకీయాల్లోకి లాగేస్తున్నారు.
ప్రస్తుతం కత్తి మహేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి… దాన్నో పెద్ద రాజకీయ వివాదంగా మార్చేందుకు… తెగ ప్రయత్నిస్తున్నారు. తన టీవీ చానల్లో చర్చపచర్చలు నిర్వహిస్తూ.. రాజకీంగా వేడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్ల మీదకు కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి శ్రీరామనవమికి తలంబ్రాలు తీసుకువెళుతుంటారని.. మరి వాళ్లు వెళ్లేది ఎవరి వద్దకో తెలియడం లేదా అని పరిపూర్ణానంద ప్రశ్నించి ముఖ్యమంత్రులని కూడా ఇందులో లాగేశారు. పనికి మాలిన వాళ్లు మాట్లాడుతూంటే… ఖండించడమే ముఖ్యమంత్రుల పనా..?
పరిపూర్ణానంద కొద్ది రోజుల నుంచి తెలంగాణలోనే సభలు పెడుతున్నారు. గతంలో మహబాబూనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సభలు పెట్టారు. తన సభలను ప్రభుత్వం అడ్డుకుందని… విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు కత్తి మహేష్ వివాదాన్ని మరింత రాజకీయం చేసేందుకు సోమవారం ప్రభుత్వ తీరుకు నిరసనగా బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర కూడా చేపడుతున్నారు. యాదగిరి గుట్టకి పాదయాత్రగా వెళ్తారట. ఈ లోపు మహేష్‌పై రాష్ట్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే…యాదగిరి గుట్టపైనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారట. మొత్తానికి కత్తి మహేష్‌తో కలిసి.. వీరంతా.. హిందూ ఉద్వేగాలు రెచ్చగొట్టేందుకు పక్కా ప్లాన్‌తో ప్రయత్నిస్తున్నట్లుగానే ఉందన్న అభిప్రాయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.